రైతులను ఆదుకోండి
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:33 AM
ఆంధ్రప్రదేశ్ రైతుల అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ముడి పొగాకు (హెచ్‌ఎస్ఎన్ 2401)పై ప్రస్తుతం అమలులో..
ముడి పొగాకుపై జీఎస్టీ 28 శాతానికి తగ్గించండి
రైతులకు మద్దతు ధరలు దక్కేలా చూడండి
ప్రకృతి వైపరీత్యాల్లో తక్షణ సాయం చేయండి
గిడ్డంగుల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వండి
కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రుల వినతి
నిర్మలా సీతారామన్, చౌహాన్‌తో భేటీ
న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రైతుల అభివృద్ధికి సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర మంత్రుల బృందం విజ్ఞప్తి చేసింది. ముడి పొగాకు (హెచ్‌ఎస్ఎన్ 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్‌టీని 28 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఈ బృందం కోరింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌తో కూడిన బృందం.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో వేర్వేరుగా పార్లమెంటులో భేటీ అయ్యింది. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల దృష్టికి తీసుకెళ్లి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం ముడి పొగాకు (హెచ్‌ఎస్ఎన్ 2401)కు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జీఎ్‌సటీ పెంపుతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎఫ్‌సీవీ పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్‌టీని 28 శాతానికి తగ్గించాలని కోరారు. ఈ నిర్ణయం ద్వారా పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో భేటీలో ఏపీలో రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై రాష్ట్ర మంత్రులు చర్చించారు.
పెరుగుతున్న పెట్టుబడి వ్యయాల దృష్ట్యా.. రైతులకు సాగు ఖర్చులు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని మంత్రుల బృందం కోరింది. నాణ్యమైన వ్యవసాయ ఇన్‌పుట్స్ అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు, పంటల ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు తక్షణ సహాయం, పంట నష్టపరిహారం, బీమా ప్రయోజనాలు సకాలంలో అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ వ్యవసాయం, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు, గోదాములు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం కోరగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తాన్‌రావు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఉపరాష్ట్రపతితో భేటీ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కూటమి ఎంపీలు మంగళవారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పార్లమెంటులో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర అభివృద్థి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్థి కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్ర ప్రగతి, రైతుల అభ్యున్నతి, ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న తీరుపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఈ భేటీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, బీద మస్తాన్‌రావు, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కేశినేని చిన్ని, జనసేన ఎంపీలు తంగెళ్ల ఉదయ్, లింగమనేని రమేశ్ పాల్గొన్నారు.