ఏపీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:55 AM
సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రుల బృందం మూడో రోజు గురువారం పలు కీలక అంశాలపై అధ్యయనం చేసింది. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (...
సింగపూర్ పారిశ్రామికవేత్తలకు మంత్రుల ఆహ్వానం
మూడో రోజు పర్యటనలో పారిశ్రామికాభివృద్ధి, పోర్టుల ఆధునికీకరణ అంశాలపై అధ్యయనం
ఎస్‌బీఎఫ్ ప్రతినిధులతో రౌండ్‌టేబుల్ సమావేశం
అమరావతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రుల బృందం మూడో రోజు గురువారం పలు కీలక అంశాలపై అధ్యయనం చేసింది. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్‌బీఎఫ్) ప్రతినిధులతో సమావేశమైన మంత్రులు.. రాష్ట్రంలో అవలంభిస్తున్న పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. మరోవైపు ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, పోర్టుల ఆధునికీకరణ, స్మార్ట్ ఎస్టేట్‌ల నిర్మాణం లక్ష్యంలో భాగంగా మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, అనిత, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్‌లు పలు కీలక సంస్థలను సందర్శించారు. మొదట ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీని మంత్రులు సందర్శించారు. అక్కడి పోర్టు కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. 2040 నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద, పూర్తిస్థాయి ఆటోమేటెడ్ టెర్మినల్‌గా అవతరించనున్న టువాస్ పోర్ట్ పనితీరు, అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత గురించి తెలుసుకున్నారు. షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగంలో కృత్రిమ మేధ, స్మార్ట్ వ్యవస్థలను అనుసంధానం చేయడం ద్వారా సమయాన్ని, ఖర్చును ఎలా ఆదా చేస్తున్నారో మంత్రుల బృందం అధ్యయనం చేసింది. సింగపూర్‌లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే ప్రభుత్వ సంస్థ జేటీసీ కార్పొరేషన్‌ను కూడా మంత్రులు సందర్శించారు. పారిశ్రామిక వాడల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఎస్టేట్‌ల నిర్మాణం, పర్యావరణ అనుకూల గ్రీన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడంలో జేటీసీ కీలక పాత్ర పోషించింది. భూమి కొరత ఉన్న సింగపూర్‌లో చమురు నిల్వ కోసం భూగర్భంలో నిర్మించిన జురాంగ్ కేవర్న్ మంత్రుల బృందాన్ని ఆకర్షించింది. ఏపీలోని తీర ప్రాంతాల్లో ఇలాంటి వినూత్న స్టోరేజ్ పద్ధతులపై మంత్రులు చర్చించారు. నెట్‌జీరో ఉద్ఘారాల లక్ష్యంతో చేపడుతున్న గ్రీన్ ప్రాజెక్టుల అమలు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కాగా, పర్యటనలో భాగంగా సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్‌బీఎఫ్) ప్రతినిధులతో మంత్రులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో తీసుకువస్తున్న కొత్త పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి తెలియజేశారు. రాజధాని అమరావతితో పాటు గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలకా్ట్రనిక్స్, లాజిస్టిక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.