కార్మికులకు చేతినిండా పని
ABN , Publish Date - May 22 , 2026 | 05:43 AM
గత వైసీపీ ప్రభుత్వం కార్మికులకు పని లేకుండా చేస్తే... కూటమి సర్కారు వారికి చేతినిండా పని కల్పించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు.
వారిలో నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుస్తాం: మంత్రి సుభాశ్
అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం కార్మికులకు పని లేకుండా చేస్తే... కూటమి సర్కారు వారికి చేతినిండా పని కల్పించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. మంగళగిరిలో గురువారం నిర్వహించిన ‘నిర్మాణ రంగంలో టెక్నాలజీపై జాతీయ నైపుణ్య సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘గత వైసీపీ ప్రభుత్వం ఎంతసేపూ వినాశనానికే తెరలేపింది. కంపెనీలను తరిమేసింది. భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వంలో కార్మికులకు మంచి రోజులొచ్చాయి. రాష్ర్టానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే... అందరికీ చేతినిండా పని లభిస్తోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా న్యాక్ సహకారంతో వారికి కొత్త ఉపకరణాల ఉపయోగంపై శిక్షణ ఇస్తున్నాం’ అని మంత్రి సుభాశ్ అన్నారు. ఈ సదస్సులో 92 కంపెనీలు, 213 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వాటిలో 47 కంపెనీలు నైపుణ్యాభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నతాధికారులు ఎంవీ శేషగిరిబాబు, గంధం చంద్రుడు, జి.గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.