అక్రమాలకు పాల్పడే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:44 AM
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ ఇబ్బందులను అధిగమించే చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
గత నెల బ్యాక్ లాగ్స్ ఈ వారంలో పూర్తి చేయండి
అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ ఇబ్బందులను అధిగమించే చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గత నెలలో వినియోగదారులు భయాందోళనలతో చేసిన ప్యానిక్ బుకింగ్స్‌కు సంబంధించిన బ్యాక్ లాగ్స్‌ను ఈ వారంలోనే పూర్తి చేయాలన్నారు. ఎల్పీజీ సిలిండర్లను పక్కదారి పట్టిస్తూ పదే పదే అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, డీఎ్‌సవోలు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, గ్యాస్ ఏజెన్సీల సమన్వయకర్తలు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మనోహర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితి, ధాన్యం కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ సూచనల అమలుపై మంత్రి చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో ఇంకా వెనుకబాటు కనిపిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయి.. గ్యాస్ సరఫరా మెరుగయ్యేంత వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండాలని మంత్రి ఆదేశించారు. కీలకమైన సమయంలో ఐదు కేజీల గ్యాస్ బండలను సరఫరా చేసేలా కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని, వీటిని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైనవారికి పంపిణీ చేయాలని సూచించారు. కేంద్రం కేటాయించిన కిరోసిన్ కూడా ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్రం వాణిజ్య సిలిండర్ల కోటా పెంచిన నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు తదితర అసోసియేషన్లతో జాయింట్ కలెక్టర్లు చర్చలు జరిపి, ఎవరికి ఎంత అవసరమో ఆమేరకే వాణిజ్య సిలిండర్లను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
9 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాల్లో రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని మంత్రి మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, రబీలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులకు సూచించారు.