Share News

రాష్ట్రంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:10 AM

రాష్ట్రంలో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో గ్యాస్‌, పెట్రోల్‌ కొరత లేదు

  • బంకులు, ఏజెన్సీల వద్దకు పరుగులు వద్దు

  • అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి మనోహర్‌

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి పెట్రోలు బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, గొడౌన్ల వద్దకు పరుగులు పెట్టొద్దని వినియోగదారులను కోరారు. ప్యానిక్‌ బుకింగ్‌ల వల్లే గ్యాస్‌ సరఫరాలో కొంత అసౌకర్యం ఏర్పడిందని తెలిపారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. ఇంటికే ఎల్పీజీ సిలిండర్లను తీసుకువచ్చి ఓటీపీ ద్వారా డెలివరీ చేస్తారని స్పష్టం చేశారు. విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 2.70 లక్షల సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వాణిజ్య సిలిండర్ల కేటాను కేంద్రం 70 శాతానికి పెంచిందని, దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులకు మరింత గ్యాస్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గ్యాస్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌, అక్రమ నిల్వలు చేస్తున్న 146 గ్యాస్‌ ఏజెన్సీలపై కేసులు నమోదు చేసి, 4,285 సిలిండర్లను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. మూడు నెలల్లో లక్ష పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌ రోజువారీ సగటు వినియోగం 7,900కిలో లీటర్లు, డీజిల్‌ 20వేల కిలో లీటర్లు ఉండగా.. డీజిల్‌ 8శాతం, పెట్రోల్‌ 2.4 శాతం సరఫరా అదనంగా పెంచినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,510 రిటైల్‌ అవుట్‌లెట్లలో 4 చోట్ల మాత్రమే డీలర్ల వ్యక్తిగత క్రెడిట్‌ సమస్యల వల్ల పెట్రోలు, డీజిల్‌ సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. వాహనదారులు ఆందోళనతో ఫుల్‌ ట్యాంకులు చేయించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

Updated Date - Apr 01 , 2026 | 06:11 AM