ఏపీ అభివృద్ధిలో భాగంకండి
ABN , Publish Date - Jun 05 , 2026 | 05:53 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
రష్యా పెట్టుబడుల్లో మమ్మల్ని భాగం చేయండి
రష్యా-భారత్ బిజినెన్ ఫోరంలో మంత్రి లోకేశ్ ప్రసంగం
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖల మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. భారత్-రష్యా మధ్య అనిర్వచనీయమైన అనుబంధం ఉందని, ఇది వ్యాపార సంబంధాలకు మించినదని అన్నారు. ఇరు దేశాల మధ్య 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరగాలని ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లక్ష్యంగా నిర్ణయించారని, ఆ వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి మూడో రోజు సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ బిజినెన్ ఫోరం (ఎస్‌పీఐఈఎఫ్) సందర్భంగా భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, రష్యా వ్యాపారవర్గాల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆయన కోరారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సతో వేగంగా పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. భారత్ అభివృద్ధికి కీలక సమయాల్లో రష్యా తోడుగా నిలిచిందన్నారు. రష్యా సహకారం అందించిన భిలాయ్ స్టీల్‌ప్లాంట్, కూడంకుళం అణువిద్యుత్కేంద్రం, గగన్‌యాన్, బ్రహ్మోస్ వంటి ప్రాజెక్టులను ప్రస్తావించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రాల్లో ఏపీ ఒకటని వివరించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణ రాష్ట్రంలోనే ఉందన్నారు. ఏపీలో రుసాల్ సంస్థ 1.5 మిలియన్ టన్నుల పయనీర్ అల్యూమినా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిందని చెప్పారు. ఇరుదేశాల మధ్య విజయవంతమైన పారిశ్రామిక భాగస్వామ్యానికి రుసాల్‌తో పాటు నయారా ఎనర్జీని ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఎల్‌ఎన్‌జీ, చమురు అన్వేషణ, పెట్రో కెమికల్, ఏరోస్పేస్, మౌలిక సదుపాయాల రంగాల్లో భవిష్యత్తులో ఏపీ ప్రధాన భాగం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో మాన్యుఫ్యాక్చరింగ్, ఓడరేవులు, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎలకా్ట్రనిక్స్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, భారీ పారిశ్రామిక ల్యాండ్ బ్యాంకులు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా, పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడిదారులకు సహకరించే పాలన రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలిపాయని వివరించారు. ఏరోస్పేస్ విడిభాగాలు, ఏవియానిక్స్ డ్రోన్లు, నావికా వ్యవస్థలు, సెమీ కండక్లర్ల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు, అంతరిక్ష సంస్థలు, ఇంధన సంస్థలు, సాంకేతిక సంస్థలు, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడిదారుగానే కాకుండా.. భాగస్వాములుగా రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు పిలుపు ఇచ్చారు. రాష్ట్రాన్ని దీర్ఘకాలిక భాగస్వామిగా చూడాలని కోరారు.
మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకరించండి
మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సుటోవ్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. భారత్‌లోని మెట్రో పాలిటన్ నగరాల్లో మాస్కో తరహా ఏఐ ఆధారిత ట్రాన్సిట్ ట్రాకింగ్, స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసేందుకు సహకారం అందించాలని కోరారు. అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ బస్సుల సముదాయాలు, స్మార్ట్ చార్జింగ్ మౌలిక సదుపాయాలను ప్రవేశపెట్టడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలన్నారు. విశాఖ ఫిన్‌టెక్ వ్యాలీలోని మున్సిపల్ ట్రాన్సిట్ లైన్‌ల కోసం సురక్షితమైన ఫేషియల్-రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు.
శ్రీసిటీలో రైల్వేట్రాక్ రోలింగ్ మిల్లు
భారత్‌లో అత్యాధునిక ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (ఈఏఎఫ్) స్టీల్ ప్లాంట్‌ను స్థాపించాలని నోవోస్టల్-ఎం చైర్మన్ ఇవాన్ డెమ్బెంకోను లోకేశ్ కోరారు. రాష్ట్రంలోని శ్రీసిటీలో రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో ఒక స్ట్రక్చరల్ సెక్షన్ రైల్వేట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని, చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ప్రాంతీయ ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా మెటీరియల్ సరఫరా చేసే ఒక ప్రత్యేక హార్డ్‌వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీని స్థాపించాలని కోరారు. నోవోస్టల్-ఎం సప్లయ్‌చైన్‌తో ప్రత్యేకమైన వాటర్‌ఫ్రంట్ బెర్త్‌లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలన్నారు. భారత్‌తోని అంతర్గత జల రవాణా మార్గాల్లో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టులు స్థాపించాలని సిస్టమా ప్రెసిడెంట్ తాగిరి సిట్ దేకోచ్ ను లోకేశ్ కోరారు. స్మార్ట్ ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్‌లు, డేటా ప్లాట్‌ఫారంలను ఏర్పాటు చేయాలని కోరారు. సిమెంట్, కాగితపు ప్యాకేజింగ్ తయారీ పరిశ్రమలను స్థాపించాలన్నారు. లోకేశ్ ప్రతిపాదనలను తాము పరిశీలిస్తామని దేకోచ్ హామీ ఇచ్చారు.
ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యం
టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు
మంత్రి లోకేశ్ నేతృత్వంలో రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం రష్యా పర్యటన అత్యంత ఫలప్రదంగా సాగుతోందని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉపాధి కల్పనే ఈ పర్యటన లక్ష్యమని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికత, లాజిస్టిక్స్ రంగాలలో అంతర్జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విజన్‌ను సాకారం చేయడంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. రష్యా పర్యటన ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, స్థానిక యువతకు విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడమే మా ప్రధాన లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.