త్వరలోనే జాబ్ క్యాలెండర్
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:27 AM
ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. దేశంలో ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి 755 కంపెనీలు: మంత్రి లోకేశ్
ఒక్కటొక్కటిగా గ్రౌండవుతున్నాయ్
ఇప్పటివరకు 4 లక్షల ఉద్యోగాల కల్పన
4 వేల ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి చర్యలు
పాదయాత్రతో జీవితంలో ఎన్నో మార్పులు.. నాటి అనుభవాలనే
నేడు అమలుచేస్తున్నాం పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాం: మంత్రి
కాకినాడ జేఎన్‌టీయూ విద్యార్థులతో ‘హలో లోకేశ్’ పేరుతో ముఖాముఖి
ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని వెల్లడి
కాకినాడ, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ అన్నారు. దేశంలో ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రాష్ట్రానికి 755 కంపెనీలు వచ్చాయన్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు లభించాయని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం తమ లక్ష్యమని గుర్తుచేశారు. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి శుక్రవారం ‘హలో లోకేశ్’ పేరుతో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్ రాష్ట్రం చేసే క్రమంలో విద్యార్థులందరూ అందులో భాగస్వాములయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. నైపుణ్యం ఉంటేనే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా సప్లయ్-డిమాండ్ తరహాలో కొత్త విధానం తెచ్చామని.. దీని ద్వారా 75 వేల మందిని స్ర్కీనింగ్ చేశామని వివరించారు. గత ఏడాదిన్నరలో 755 కంపెనీలు రాష్ట్రానికిరాగా.. అవన్నీ ఒక్కొక్కటిగా గ్రౌండ్ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 4 వేల ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాల్సిఉందని, న్యాయపరమైన చిక్కులు తొలగించి వీటి భర్తీకి చర్యలు చేపడతామన్నారు. కొంతమంది కులం, మతం, ప్రాంతం అనే భావన తీసుకొచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాకు పిల్లలను దూరంగా ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇకపై నెలకోసారి విద్యార్థులను కలుస్తానని ప్రకటించారు.
అండగా పవన్..
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గురించి వివరిస్తూ.. కష్టకాలంలో తమ కుటుంబానికి పవన్ అండగా నిలిచిన విషయాన్ని ఎప్పటికీ మరచిపోనన్నారు. అంతకుముందు జేఎన్టీయూలో రూ.10 కోట్లతో నిర్మించిన పీజీ బాలుర వసతి గృహాన్ని లోకేశ్ ప్రారంభించారు. ‘ఇన్నోవేషన్ ఫెయిర్’లోని 20 స్టాళ్లను సందర్శించారు. అనంతరం కోరమాండల్ కంపెనీకి చెందిన 60 పడకల ఇంటిగ్రేటెడ్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.
పాదయాత్ర నా జీవితాన్ని మార్చేసింది..
జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని మారుస్తాయని, యువగళం పాదయాత్ర కూడా తన జీవితాన్ని అలాగే మార్చేసిందని లోకేశ్ అన్నారు. కోట్లాదిమంది ప్రజలు, యువత ఆశలు, ఆకాంక్షలు, సమస్యలను తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభించిందని తెలిపారు. నాటి అనుభవాలనే ఇప్పుడు ప్రభుత్వంలో అమలుచేస్తున్నామని స్పష్టంచేశారు. ‘హలో లోకేశ్’లో విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను, సమస్యలను సీరియ్‌సగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొంతకాలం కిందట కుంభమేళాకు వెళ్లానని, అక్కడ చేపట్టిన రద్దీ నియంత్రణ విధానం సమర్థంగా ఉందన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారని, అటువంటివి ఇక జరగకుండా ఈసారి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పుష్కర ఘాట్లలో క్రౌడ్ మేనేజ్‌మెంట్, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా డిజిటల్ ట్విన్ ప్రాజెక్టులు తయారు చేయాలని జేఎన్టీయూను కోరారు.
కూటమిని విడదీయలేరు...
కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యమని లోకేశ్ తెలిపారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా.. విడదీయడం ఎవరి తరమూ కాదన్నారు. గ్రామస్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కూటమిలో ఉండడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోగలిగామని చెప్పారు. నాయకులు అలగడం తగదని, ప్రతి ఒక్కరి కష్టాన్నీ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. టీడీపీ ఒక కుటుంబమని.. కుటుంబంలో సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. గతంలో ఎంతోమంది టీడీపీని భూస్థాపితం చేస్తామన్నారని.. వారంతా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసన్నారు. తనకు వాట్సా్‌పలో కార్యకర్తలు పంపుతున్న మెసేజ్‌లు చదవడానికి మూడు గంటలు పడుతోందని, దీని ద్వారా కార్యకర్తల మనోభావాలు తెలుస్తున్నాయని చెప్పారు. కార్యకర్తలు రెవెన్యూ, పోలీసుశాఖ అధికారుల వద్దకు పనులపై వెళ్తే పట్టించుకోవడం లేదని కొందరు తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. టీడీపీ కోసం ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడికి కూటమి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని పట్టుబట్టి అసెంబ్లీలో బిల్లు ఆమోదిస్తే.. మండలిలో వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆక్షేపించారు. వచ్చే సమావేశాల్లో దీనిని ఆమోదింపజేసి చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీఇచ్చారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్తా చేస్తున్న సేవలు, కష్టాలను మై టీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి.. నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
