ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:24 AM
‘నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే.. నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
పాతికేళ్ల క్రితం ఐటీ విప్లవంతో తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు: మంత్రి కొల్లు
విజయవాడ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘నిన్నటి వరకు ప్రపంచాన్ని ఐటీ రంగం శాసిస్తే.. నేడు ఏఐ యుగం మొదలైంది. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలి’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన ఏఐ ఫ్యూజన్(అమరావతి ప్రాంతం లో తొలి ఏఐ సమ్మిట్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘పాతికేళ్ల క్రితం ఐటీ ప్రాధామ్యాన్ని ముందుగానే గుర్తించి, దూరదృష్టితో హైదరాబాద్‌లో అనేక ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఆ ఫలితమే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు అంతకంటే గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పిల్లలకు అవసరమైన సాంకేతిక జ్ఞానం అందించాలి. తద్వారా యువత భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అనేక రకాలుగా నష్టపోయింది. సుమారు 800 కంపెనీలు వెళ్లిపోయాయి. గత రెండేళ్లలో దేశానికి వచ్చిన పెట్టుబడులలో 25 శాతం ఏపీలోనే ఏర్పాటయ్యాయంటే అది మన నాయకుడి గొప్పతనం. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్నట్టు జగన్ వ్యాఖ్యానించడం, మావిగన్ అంటూ విచిత్ర ప్రతిపాదనలు తీసుకురావడం సిగ్గుచేటు’’ అని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో ఐటీఏఏపీ ప్రెసిడెంట్ ఇంద్రజిత్ అన్నే, ఏపీ డీటీఐ నెట్‌వర్క్ చైర్మన్ శ్రీధర్ కొసరాజు, ఇన్ఫోసిస్ డెవలె్‌పమెంట్ సెంటర్ హెడ్ సుధీర్ నర్రా, పలువురు ఏఐ డెవలెపర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
మత్స్యకారుల జీవితాలతో జగన్ రాజకీయం
అమరావతి : మత్స్యకారుల జీవితాలతో జగన్ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ‘మత్స్యకారుల పొట్టకొట్టిన చరిత్ర వైసీపీది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తీరప్రాంతాల్లోని భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, ఎదురు తిరిగినవారిపై దౌర్జన్యాలు చేయడం వంటి దాష్టీకాలు చేశారు. జగన్ ప్రభుత్వం జీవో 217 తీసుకొచ్చి చెరువులను నాశనం చేసింది. ఇప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల కపట ప్రేమను చూపిస్తున్నారు. తమిళనాడు నుంచి బోట్లు మన రాష్ట్ర జలాల్లోకి ప్రవేశించి చేపలు పట్టడం చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీన్ని అదుపు చేసేందుకు 2014-19 మధ్య కోస్టుగార్డు పరిధిలో 18 బోట్లు ఉంచి గస్తీ కాయించిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. వైసీపీ హయాంలో ఈ గస్తీ బోట్లను అటకెక్కించారు. గస్తీ బోట్లను తిరిగి గాడిన పెట్టి ఒక్క తమిళనాడు బోటు కూడా మన జలాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటాం. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర సాగర్ షిప్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికతతో కూడిన షిప్ యార్డు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని వక్రీకరించి వైసీపీ వారు హార్బర్‌ను ప్రైవేటు పరం చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు’ అని కొల్లు మండిపడ్డారు.