Share News

మానవ తప్పిదంతోనే ఆ బస్సు ప్రమాదాలు

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:31 AM

ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్టవేసి సురక్షితమైన, చట్టబద్ధమైన ప్రయాణాలను అందించడానికి రోడ్డు రవాణా శాఖ కృషి చేస్తుందని మంత్రి మైడిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

మానవ తప్పిదంతోనే ఆ బస్సు ప్రమాదాలు

  • ఇకపై 365 రోజులూ నిఘా

  • స్లీపర్‌ బస్సుల నియంత్రణకు యోచన: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

మంగళగిరి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఇటీవలి కాలంలో బస్సు ప్రమాదాలు ఆందోళనలు కలిగిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్టవేసి సురక్షితమైన, చట్టబద్ధమైన ప్రయాణాలను అందించడానికి రోడ్డు రవాణా శాఖ కృషి చేస్తుందని మంత్రి మైడిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గుంటూరు-విజయవాడ మార్గంలో కాజ టోల్‌ప్లాజా వద్ద బుధవారం రాత్రి మంత్రి స్వయంగా రవాణా శాఖ సిబ్బందితో కలసి ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘గత పది రోజులుగా పోలీసు శాఖతో కలసి మా శాఖాధికారులు రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికి సుమారుగా 70 బస్సులను సీజ్‌ చేశాం. మార్కాపురం, కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాల వల్ల జరిగినవేనని విచారణలో తేలింది. ప్రైవేటు బస్సులను పూర్తి కండిషన్‌లో నడపాలి. 300 కి.మీలకు పైబడి తిరిగే రూట్లలో ఇద్దరేసి డ్రైవర్లను విధిగా ఉండాలి. ఈ తనిఖీల్లో ప్రధానంగా అత్యవసర ద్వారాలను తెరుచుకుని ప్రయాణీకుడు త్వరితగతిన బయటకు రాగలుగుతాడా? లేదా? అన్న అంశంతోపాటు ప్రమాదం జరిగినప్పుడు వెంటిలేటర్‌ గ్లాసులను పగులగొట్టుకుని వెలుపలికి వచ్చే సదుపాయాలను కల్పించారా లేదా? అగ్ని ప్రమాదం సంభవించినపుడు నియంత్రణకు బస్సులో రెండేసి అగ్నిమాపక సిలిండర్లను ఏర్పాటు చేయాలి. వాటిని ఏర్పాటు చేశారా? లేదా? అన్న విషయాలను పరిశీలిస్తున్నాం. ఇకమీదట అన్ని బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు మూడేసి వంతున వుండేలా నిబంధనలు తీసుకొస్తున్నాం. ఇకమీదట 365 రోజులూ... 24/7 మా నిఘా కొనసాగి తీరుతుంది. రివల్యూషనరీగా ఇకపై ప్రతీ బస్సులో రెండేసి సీసీ కెమేరాలను విధిగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఒకదానిని డ్రైవర్‌ వైపు, రెండో దానిని ఎదురుగా వచ్చే వాహనాలవైపు ఉండేలా బిగించాలి. దీనికి సంబంధించి కొత్తగా చట్టం తీసుకురాబోతున్నాం. స్లీపర్‌ బస్సులను దశల వారీగా నియంత్రించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి తెలిపారు.

Updated Date - Apr 09 , 2026 | 06:31 AM