Share News

నాణ్యమైన విద్యుదుత్పత్తే లక్ష్యం

ABN , Publish Date - Apr 09 , 2026 | 05:27 AM

ప్రజలకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు.

నాణ్యమైన విద్యుదుత్పత్తే లక్ష్యం

  • చార్జీలు పెంచకుండా నిరంతరాయంగా అందిస్తాం

  • ఏపీసీపీడీసీఎల్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

విజయవాడ(గుణదల), ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ప్రజలకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నూతన కార్యాలయ ప్రారంభ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ.. సిబ్బంది సమష్టి కృషితో విద్యుత్‌ శాఖకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. సుమారు రూ.35 నుంచి 45 కోట్ల వ్యయంతో 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక కార్పొరేట్‌ కార్యాలయాన్ని నిర్మించుకున్నామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. విద్యుత్‌ అంతరాయం, లో-వోల్టేజి సమస్యలు లేకుండా చూడాలని సీఎం దిశానిరేదశం చేశారని చెప్పారు. విద్యుత్‌ శాఖ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని ప్రస్తుతం ఉన్న 80 శాతం నుంచి 95 శాతం వరకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్‌ అందించేందుకు పెట్టిన ఇబ్బందులు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, టెక్నికల్‌ డైరెక్టరు మురళీ కృష్ణ యాదవ్‌, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ టీవీఎస్‌ మూర్తి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 05:27 AM