జెన్కోలో 27 మందికి కారుణ్య నియామకాలు
ABN , Publish Date - Jan 31 , 2026 | 05:24 AM
కారుణ్య నియామకాల ద్వారా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
కూటమి హయాంలో 500కుపైగా ఉద్యోగాలిచ్చాం
అర్హులందరికీ జూనియర్ ఇంజనీర్‌గా నియామకాలు
వైసీపీ హయాంలో అర్హులకూ ఇవ్వలేదు: మంత్రి గొట్టిపాటి
అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): కారుణ్య నియామకాల ద్వారా బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విద్యుత్ శాఖలో వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 27 మంది లబ్ధిదారులు.. మంత్రి, సీఎస్ విజయానంద్ నుంచి నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ శాఖలో సుమారు 500 మందికిపైగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో అన్ని అర్హతలున్న వారికి కూడా జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, కూటమి ప్రభుత్వం విద్యార్హతలను బట్టి జూనియర్ ఇంజనీర్ పోస్టులను కూడా ఇచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి కారుణ్య నియామకాలు చేపడుతోందని తెలిపారు. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులు స్కిల్స్‌ను పెంచుకుంటే పదోన్నతులు త్వరగా వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, నారాయణ, సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డితోపాటు జెన్కో డైరెక్టర్లు పాల్గొన్నారు.