Share News

అభివృద్ధిని అడ్డుకుంటున్న గొడ్డలి పార్టీ

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:40 AM

రాష్ట్రం లో అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోంది. అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం...

అభివృద్ధిని అడ్డుకుంటున్న గొడ్డలి పార్టీ

  • అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు: మంత్రి అనగాని

తిరుపతి(టీటీడీ), జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం లో అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయడం ద్వారా అభివృద్ధిని అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోంది. అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం తిరుపతిలోని కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘తిరుపతి పరిధిలో పర్యాటక అభివృద్ధికి భూములు కేటాయించాం. వారికి అవసరమైన మేరకు రాయితీలు కల్పించాం. వైసీపీకి చెందిన కొందరు నేతలు అడ్డగోలుగా మంత్రులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరుగకూడదనేది వారి ఆలోచన. అధికారంలోకి వస్తే అంతుచూస్తామంటూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. బెదిరిస్తే మేం భయపడం. 2029లో కాదు కదా 2049కి కూడా ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఆశలు పెట్టుకోవద్దు. మేం వాళ్లలాగా ఆలోచించం కనుకే ఇంకా వాళ్లు పదిలంగా ఉన్నారు. యూట్యూబ్‌ను అడ్డుపెట్టుకొని అడ్డగోలుగా పోస్టులు పెడుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం’ అని మంత్రి హెచ్చరించారు.

జగన్‌ ‘స్పైడర్‌’లోని సైకో విలన్‌

‘కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టే డీఎన్‌ఏ జగన్‌ పూర్వీకుల్లోనే ఉంది. హైదరాబాదులో మతాల మధ్య గతంలో చిచ్చుపెట్టారు. స్పైడర్‌ సినిమాలో సైకో విలన్‌లాగా జగన్‌ ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబుకు, పవన్‌ కల్యాణ్‌కు కులాలు, మతాలు లేవు. వారికి తెలిసిందల్లా అభివృద్ధి, సంక్షేమమే. లోకేశ్‌ను సెకండ్‌ జనరేషన్‌ లీడర్‌ అని మంగళవారం ఢిల్లీలో అందరూ అన్నారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దగ్ధం కేసు సీఐడీ పరిధిలో ఉంది. దర్యాప్తు పూర్తయిన వెంటనే నిందితులపై కఠినమైన చర్యలుంటాయి. అవిలాల భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా కొందరు తెరమీదకు తీసుకువస్తున్నారు. భూములు కొనుగోలు చేసిన వ్యక్తికి, మాకు ఏ సంబంధం లేదు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. నాపై, ఎమ్మెల్యే పులివర్తి నానీపై బురదజల్లితే భయపడే వాళ్లం కాదు’ అని మంత్రి అనగాని చెప్పారు.

Updated Date - Jun 25 , 2026 | 03:40 AM