Share News

‘ఉపాధి’ హాజరు యాప్‌ దుర్వినియోగం

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:10 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతకు భంగం కలిగించే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

‘ఉపాధి’ హాజరు యాప్‌ దుర్వినియోగం

  • ఒకే ఫొటో పలుమార్లు అప్‌లోడ్‌

  • అక్రమాలను గుర్తించిన కేంద్రం

  • రాష్ట్రంలో 1728 మస్టర్‌ రోల్స్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకతకు భంగం కలిగించే అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శ్రామికుల హాజరు నమోదుకు ఉపయోగిస్తున్న నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్) యాప్‌లో ఒకే ఫొటోను పలుమార్లు అప్‌లోడ్‌ చేసిన ఘటనలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా విచారణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ సంబంధిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సాంకేతిక విశ్లేషణలో 2026 మే 29 నుంచి జూన్‌ 10 వరకు నమోదైన హాజరులో ఒకే ఫొటోను వేర్వేరు తేదీల్లో లేదా వేర్వేరు మస్టర్‌ రోల్స్‌కు ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిని అత్యంత తీవ్రమైన అక్రమంగా పరిగణించిన కేంద్రం.. సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.


మొబైల్‌ పరికరాలూ పరిశీలన

ఫొటోలు అప్‌లోడ్‌ చేసిన మొబైల్‌ పరికరాల వివరాలు, వినియోగదారుల వివరాలు, హాజరు నమోదు సమయాలు, జియోట్యాగింగ్‌, ఇతర డిజిటల్‌ ఆధారాలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఇతర బాధ్యుల పాత్రను కూడా పరిశీలించాలని సూచించారు. అక్రమాలు రుజువైతే సంబంధిత అధికారులపై శాఖాపరంగా, చట్టపరంగానూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్‌ విచారణ తర్వాత యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును కమిషనర్‌ కార్యాలయానికి పంపించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నందున నివేదికలను ఆలస్యం చేయవద్దని కోరారు.


1728 మస్టర్‌ రోల్స్‌పై అనుమానాలు

కేంద్రం పంపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 1728 మస్టర్‌రోల్స్‌ అనుమానస్పదంగా ఉన్నాయని గుర్తించారు. జిల్లాల వారీగా విశాఖపట్నం 863, చిత్తూరు 200, నెల్లూరు 176, అనంతపురం 159, తూర్పుగోదావరి 96, కడప 65, విజయనగరం 44, కర్నూలు 38, ప్రకాశం 29, కృష్ణా 24, శ్రీకాకుళం 23, పశ్చిమగోదావరి 10, గుంటూరు 1 మస్టర్‌ అనుమానస్పదంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అనుమానస్పద మస్టర్‌ రోల్స్‌పై జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించాలని కమిషనర్‌ ఆదేశించారు. నిజంగా శ్రామికులు పనిచేశారా?, ఫొటోలు ఎందుకు పునరావృతమయ్యాయి, సాంకేతిక లోపమా? అనే అంశాలను నిర్ధారించాలని సూచించారు.

Updated Date - Jul 14 , 2026 | 05:12 AM