Share News

బెడిసికొట్టిన జగన్‌ వ్యూహం

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:45 AM

అధికారంలోకి వస్తే ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానంటూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌ నిలబెట్టుకోలేదు.

బెడిసికొట్టిన జగన్‌ వ్యూహం

  • డీఎస్సీని ఆపాలని నాడు ఎత్తులు

  • పేపరు లీకేజీ అంటూ నానా యాగీ

  • ఫలితం లేకపోవడంతో స్పోర్ట్స్‌ కోటాపై కోర్టుల్లో పెద్ద ఎత్తున పిటిషన్లు

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానంటూ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్‌ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు 16 వేల టీచరు పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా నింపిన కూటమి ప్రభుత్వంపై అక్కసు.. ఆక్రోశంతో హైకోర్టులో జగన్‌ ముందుగానే పిటిషన్లు వేయించారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తయితే కూటమి ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని భయపడ్డారు. డీఎస్సీ ప్రక్రియను కోర్టు ద్వారా ఆపించి.. రాజకీయంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రచేశారు. ఇందులో భాగంగా.. పేపర్‌ లీక్‌ అయ్యిందంటూ యాగీ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని పట్టుబట్టారు. లీక్‌ వాదన బెడిసికొట్టడంతో .. స్పోర్ట్స్‌ కోటాలో అర్హులకు పోస్టులు ఇవ్వలేదంటూ మాట మార్చారు. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యతిరేక ఉద్యమం తరహాలో రాష్ట్రంలో గత నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్ధులు, విద్యార్ధులు, యువత ఆందోళన చేపట్టాలని పిలుపిచ్చారు. అయితే ఆ ఆందోళనల్లో యువతే కనిపించలేదు. తాజాగా డీఎస్సీపై హైకోర్టులో పిల్‌ వేయించి రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహం కూడా బెడిసికొట్టింది.

Updated Date - Aug 05 , 2026 | 03:46 AM