విషనాగుల బుసలు
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:45 AM
మెగా డీఎస్సీపై ఒక ఆరోపణ చేయడం.. అది అబద్ధమని రుజువైనా, వెంటనే మరో ఆరోపణ చేయడం.. అదీ అబద్ధమని తేలినా మళ్లీ అదే వరుస! ప్రతిసారీ బొక్కబోర్లా పడుతున్నా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు.
అబద్ధాల ఫ్యాక్టరీగా మారిన వైసీపీ
అధికారం కోసం అప్పుడూ, ఇప్పుడూ అదే రూటు
మెగా డీఎస్సీపై జ‘గన్’ మిస్‌ఫైర్
అక్రమాలంటూ పదే పదే తప్పుడు ఆరోపణలు
అవన్నీ అబద్ధాలని తేలినా తీరు మారని వైనం
మొదట పేపర్ లీకంటూ దుష్ప్రచారం
ఆ తర్వాత మెరిట్ జాబితాలు.. సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో డ్రామాలు
చివరికి క్రీడా కోటాపై విమర్శలు
ప్రతిదీ అబద్ధమని తేల్చిన ప్రభుత్వం
ఫేక్ ఆడియోతో మరోసారి డ్రామా
దిక్కుతోచక ఇప్పుడు కులం కార్డు తెరపైకి
స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీ 42 పోస్టుల్లో
కమ్మ వర్గం వారికే ఎక్కువని ఆరోపణలు
గణాంకాలతో సహా వెల్లడించిన ప్రభుత్వం
ఎక్కువ పోస్టులు కాపులు(16), రెడ్లకే(10)
ఆ తర్వాతి స్థానంలో కమ్మలు(9)
అడుగడుగునా అభాసుపాలైన వైసీపీ
ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పినా... అది నిజం కాదు!
కానీ... ఎంతో కొంతమంది నమ్ముతారన్నది వైసీపీ పాలసీ!
అందుకే, నిజం కాదని తెలిసినా బురద చల్లడం మానదు!
ప్రభుత్వం అన్ని రకాలుగా స్పష్టత ఇచ్చినా తన ‘పాలసీ’ మార్చుకోదు. ఒకే అబద్ధానికి రోజుకో రకం కొత్త వక్రీకరణలు జోడిస్తుంది. పనిలో పనిగా ఇక్కడా, పొరుగు రాష్ట్రంలోనూ పాగా వేసిన ‘పేటీఎం బ్యాచ్’ పడగ విప్పుతుంది. నిత్యం బుసలు కొడుతూ విషం చిమ్మడమే! ఇదంతా 2019 ఎన్నికల ముందు చేసిందే! అప్పట్లో అమరావతిపై ఒక కులం ముద్ర వేశారు. డీఎస్పీ పదోన్నతులు ఒక కులం వారికే దక్కాయన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నానా రచ్చ చేశారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పవర్ పోగానే మళ్లీ పాత ‘పాలసీ’ బయటికి తీశారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో (డీఎస్సీ) అక్రమాలు జరిగాయంటూ రోజుకో ఆరోపణ చేస్తున్నారు.
అధికారులే మీడియా ముందుకు వచ్చి... ప్రతి ఆరోపణకూ సమాధానం ఇవ్వడంతో పాటు ఆ ఆరోపణలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఏం జరిగిందో వివరణ ఇవ్వడంతో అసలు విషయం ప్రజలకు అర్థమైంది. కానీ.. చివరికి వైసీపీ మళ్లీ ‘కులం’ కార్డు తీసింది. స్పోర్ట్స్ కోటాలో కమ్మ వారికే అధిక పోస్టులు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది. దీనిపై ప్రభుత్వం క్షణాల్లో స్పందించింది. ఈ కేటగిరీలో ఏ కులం నుంచి ఎంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారో లెక్క విప్పి చెప్పింది. అసలు నిజం బయటపడగానే... పేటీఎం బ్యాచ్ గప్‌చుప్!
అబద్ధం
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో కమ్మ వర్గం వారే ఎక్కువ మంది ఉద్యోగాలు పొందారని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆరోపించింది.
వాస్తవం
మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీ కింద 42 పోస్టులు భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందినవారిలో కాపులు 16 మంది, రెడ్లు 10 మంది, కమ్మలు 9మంది, వైశ్యులు ఇద్దరు, క్షత్రియులు ఇద్దరు, బ్రాహ్మణులు ఇద్దరు, ముస్లిం ఒకరు ఉన్నారు. కమ్మ అభ్యర్థుల కంటే.. కాపులు, ఆ తర్వాత రెడ్లు ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మెగా డీఎస్సీపై ఒక ఆరోపణ చేయడం.. అది అబద్ధమని రుజువైనా, వెంటనే మరో ఆరోపణ చేయడం.. అదీ అబద్ధమని తేలినా మళ్లీ అదే వరుస! ప్రతిసారీ బొక్కబోర్లా పడుతున్నా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు. ‘నవ్విపోదురుగాక.. నాకేంటి’ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. మెగా డీఎస్సీలో ‘లేని అక్రమాలు’ జరిగాయని జనాన్ని నమ్మించడానికి పడరానిపాట్లు పడుతోంది. మొదట పేపర్ లీకన్నారు. ఆ ఆరోపణ తప్పని రుజువైంది. తర్వాత మెరిట్ జాబితాలు పెట్టలేదన్నారు. అదీ అబద్ధమని తేలింది. అయినా అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచినా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుతో పరిశీలనకు ఎందుకు పిలవాల్సి వచ్చిందో ప్రభుత్వం కళ్లకు కట్టినట్లు వివరించింది.
ఇక లాభం లేదనుకుని.. జనరల్ డీఎస్సీని వదిలేసి క్రీడా కోటాపై పడ్డారు. దానిపై చేసిన ఆరోపణలు కూడా అన్నీ కట్టుకథలేనని తేలింది. దీంతో చిట్టచివరి అస్త్రంగా కులాన్ని తెరపైకి తెచ్చారు. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ ఉద్యోగాలిచ్చారంటూ భజన పేటీఎం బ్యాచ్‌తో దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలొచ్చాయో వెంటనే ప్రభుత్వం బయటపెట్టింది. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు భర్తీ చేయగా.. కాపులు 16, రెడ్లు 10, కమ్మలు 9, వైశ్యులు 2, క్షత్రియలు 2, బ్రాహ్మణులు 2, ముస్లిం 1 టీచర్ పోస్టు సాధించారు. అంటే.. ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది కాపులకు. ఆ తర్వాత రెడ్లకు. ఆ తర్వాతి స్థానంలో కమ్మ సామాజికవర్గం వారు ఉన్నారు. దీంతో వైసీపీ ప్లాన్ బూమరాంగ్ అయిపోయింది.
తొమ్మిది నెలల తర్వాత ఆరోపణలు
వాస్తవానికి 2025 సెప్టెంబరులోనే డీఎస్సీ ప్రక్రియ ముగిసింది. దాదాపు 9 నెలలు వైసీపీ నోరెత్తలేదు. అకస్మాత్తుగా గత కొద్ది వారాలుగా మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే ప్రచారం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే... ఎస్‌సీఈఆర్‌టీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన నవీన్ తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అతను డీఎస్సీ పరీక్షలు రాశారు. అతనికి మెరుగైన ర్యాంకులు రావడంతో పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచింది. కానీ అతను హాజరు కాలేదు. ఫలితంగా ఉద్యోగం దక్కలేదు. అయితే తనకు కావాలనే ఉద్యోగం ఇవ్వలేదని నవీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. అతనికి అన్యాయం జరిగిందని గానీ, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని గానీ కోర్టు తప్పుపట్టలేదు. అయితే ఎస్‌సీఈఆర్‌టీలో పనిచేసిన ఉద్యోగి పరీక్షలు రాయడంతో మొత్తం పేపర్లన్నీ లీకయ్యాయంటూ వైసీపీ దుష్ప్రచారం ప్రారంభించింది. దీనిపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ టీసీఎస్ అయాన్ సెంటర్ల ద్వారా పరీక్షలు ఎలా నిర్వహించింది? ఎంత సెక్యూరిటీ ఉన్నది? అనేది సవివరంగా బయటపెట్టింది. మొత్తం 42 వేల ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంకు తయారు చేస్తే దాన్ని ఎలా లీకు చేస్తారంటూ ప్రశ్నించింది. దీంతో వైసీపీ సర్టిఫికెట్ల పరిశీలన అంశాన్ని తెరపైకి తెచ్చింది. 1:1 నిష్పత్తిలో పరిశీలనకు పిలిచినప్పుడు అందరికీ ఉద్యోగాలు ఎందుకివ్వలేదని జగన్ ప్రశ్నించారు. అంతకుముందు 26 మంది ఉద్యోగాలు రాని డీఎస్సీ అభ్యర్థులను కూర్చోబెట్టుకుని వీరికి అన్యాయం చేశారని ఆరోపించారు. దీంతో హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా అమలౌతుందో ప్రభుత్వం మరోసారి వివరించింది. ఆ 26 మంది కేసులనూ వేర్వేరుగా సవివరంగా అధికారులు వివరించారు. దీంతో ఈ ఆరోపణపైనా వైసీపీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత మెరిట్ జాబితాలు ప్రదర్శించలేదని ఆరోపణలూ చేశారు. కానీ మెరిట్ జాబితాలన్నీ పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌లో ఇప్పటికీ అందుబాటులోనే ఉంచింది. అందులో డీఎస్సీతో పాటు టెట్ మార్కులూ ఉన్నాయి. దీంతో క్రీడా కోటాలో ఇంటర్ కాలేజీ స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికీ ఉద్యోగాలిచ్చారని జగన్ ఆరోపించారు. దుర్గయ్య అనే ఆర్చరీ గోల్డ్ మెడలిస్ట్‌కు ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. అయితే ఇంటర్ కాలేజీ పోటీలను అసలు పరిగణనలోకే తీసుకోలేదని అదే రోజు సాయంత్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీలో ఇంటర్ కాలేజీ, స్కూల్ గేమ్స్, రూరల్ గేమ్స్, మహిళా క్రీడా ఫెస్టివల్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలిచ్చారని వివరించింది. దీంతో కంగుతిన్న వైసీపీ వెనక్కితగ్గక తప్పలేదు. మరోవైపు దుర్గయ్య తనకు గోల్డ్ మెడల్ ఉందని దరఖాస్తులో పేర్కొనలేదని హైకోర్టుకు తెలిపారు. అందువల్లే అతనికి ఉద్యోగం రాలేదు. ఇటీవల జగన్ ప్రెస్‌మీట్‌లో మరో అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టాలని చూశారు. టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారంటూ.. ఎవరో దళారులు అభ్యర్థులతో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియోలను ప్రెస్‌మీట్‌లో వినిపించారు. ప్రభుత్వ చిహ్నాన్ని లోగోగా పెట్టుకుని మరీ దళారులు అభ్యర్థులతో మాట్లాడినట్లుగా ఆ ఆడియో కాల్ ఉందని చూపించారు. దానిపై అప్పట్లోనే కేసు నమోదైంది. ఆ ఆడియోను జగన్ ప్రెస్‌మీట్‌లో వినిపించి ఆ నంబరు కూడా చూపించారు. దానిపై ఆరా తీయగా బొంత రోశయ్య అనే వ్యక్తి అందులో దళారి పాత్ర పోషించినట్లుగా ఉంది. అతను ఎవరంటే.. జగన్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు అనుచరుడు. అతని పేరుతో నకిలీ ఆడియో కాల్ మాట్లాడించి అది నిజం అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. అది కూడా జగన్ ఆ కాల్‌ను వినిపించడంతో అసలు గుట్టు బయటపడింది.
క్రీడా కోటా ఉద్యోగాలు ఎవరికెన్నంటే..
382 టీచర్ ఉద్యోగాలు క్రీడా కోటాలో భర్తీ అయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే ఎస్సీ-3 కేటగిరీ అభ్యర్థులకు 72, బీసీ-డీకి 63, బీసీ-ఏకు 53, బీసీ-బీకి 48, ఓసీకి 42, ఎస్సీ- 2కి 38, ఎస్టీకి 29, బీసీ-ఈకి 28, బీసీ-సీకి 4, ఎస్సీ-1కి 2, ఓసీ(ఈడబ్ల్యూఎ్‌స)కి 1 ఉద్యోగాలొచ్చాయి.
గతంలోనూ కులం కార్డు
గత టీడీపీ ప్రభుత్వంలో 37 మందిలో 36 మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన అధికారులకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చారని అప్పట్లో వైసీపీ ఆరోపణలు చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక వారిలో నలుగురే కమ్మ వర్గంవారున్నారని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు మెగా డీఎస్సీ విషయంలోనూ మట్టికరచింది.
వైసీపీ సర్కారుకు, కూటమికి ఇదీ తేడా
గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఏపీపీఎస్సీ కార్యాలయంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువులు, స్నేహితులు టాపర్లుగా నిలిచారు. ఆ ఉద్యోగాలకు పేపర్ల సెట్టింగ్ ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే జరిగింది. అప్పట్లో దీనిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పటి ప్రభుత్వం దానిపై కిక్కురమనలేదు. అయితే మెగా డీఎస్సీపై ఆరోపణలు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది. విపక్షం చేసిన ప్రతి ఆరోపణకూ వివరణ ఇచ్చింది. గణాంకాలతో తిప్పికొట్టింది.