Share News

చిరుద్యోగికి పెద్ద బాధ్యతలు

ABN , Publish Date - May 05 , 2026 | 05:50 AM

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎంఎస్ఐడీసీ) అడ్డగోలు నిర్ణయాలకు చిరునామాగా మారుతోంది. కార్పొరేషన్‌లో డ్రగ్స్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టు చాలా కీలకం.

చిరుద్యోగికి పెద్ద బాధ్యతలు

  • జూనియర్‌ అనలిస్ట్‌ చేతికి డ్రగ్‌ విభాగం

  • జీఎం, ఫార్మసిస్టు, సూపరింటెండెంటు... అన్నీ అతనే

  • మెడికల్‌ కార్పొరేషన్‌లో మరొక వివాదాస్పద ఉత్తర్వు

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎంఎస్ఐడీసీ) అడ్డగోలు నిర్ణయాలకు చిరునామాగా మారుతోంది. కార్పొరేషన్‌లో డ్రగ్స్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టు చాలా కీలకం. ఇలాంటి కీలకమైన డ్రగ్స్‌ విభాగానికి రెండు వారాల క్రితం జనరల్‌ మేనేజర్‌గా ఒక జూనియర్‌ అనలిస్ట్‌ను నియమించారు. నిబంధనల ప్రకారం ఔషఽధ నియంత్రణ మండలిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులను ఈ పోస్టుల్లో నియమించాలి. కానీ ఒక జూనియర్‌ అనలిస్ట్‌కు కార్పొరేషన్‌లో డ్రగ్‌ జీఎం బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాక.. డ్రగ్స్‌ విభాగంలో ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే సూపరింటెండెంట్‌ పోస్టుకు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా సదరు ఉద్యోగికే కట్టబెట్టారు. దీనికోసం డ్రగ్స్‌ విభాగంలో రూ.కోట్ల బిల్లులు మొత్తం చిరుద్యోగి కనుసన్నల్లో నడిచే విఽధంగా నిబంధనలనూ మార్చారు. ఈ నిర్ణయం మరిన్ని విమర్శలకు దారితీసింది. ల్యాబ్‌లో పరీక్షలు చేయాల్సిన చిన్న ఉద్యోగి, ఏపీఎంఎస్ఐడీసీలో ఫార్మసిస్టుగా, డ్రగ్స్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా, ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు చూసే సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీఎఫ్‌సీ చైర్మన్‌గా కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాల్సిన ఆయనే ఎండీ హోదాలో అజెండా సిద్ధం చేస్తే పారదర్శకతకు ప్రాధాన్యత ఎక్కడ ఉంటుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - May 05 , 2026 | 05:51 AM