సమగ్ర నివేదిక ఇవ్వండి
ABN , Publish Date - May 10 , 2026 | 04:48 AM
ఆరోగ్య శాఖలో వైద్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాల గురించి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు.
వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారంపై ఆరోగ్య శాఖ కార్యదర్శికి మంత్రి సత్య ఆదేశం
ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచన
‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై స్పందన
అమరావతి, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య శాఖలో వైద్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాల గురించి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. మెడికల్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ)లో పరికరాల కొనుగోలు వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆరోగ్య శాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్‌ను లిఖితపూర్వకంగా ఆదేశించారు. అవసరం లేకపోయినా ఎక్కువ ధరలకు వైద్య పరికరాలను కొనుగోలు చేస్తున్నారని, కొంతమంది సరఫరాదారులకు అనుగుణంగా సాంకేతిక ప్రమాణాలు రూపొందిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డిస్ క్వాలిఫై అయిన కంపెనీలకు తిరిగి అవకాశాలు ఇస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై వెంటనే సమగ్ర నివేదికను సమర్పించాలని కార్యదర్శిని ఆదేశించారు. భవిష్యత్తులో ఆరోపణలకు తావులేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా వైద్య పరికరాల కొనుగోలు జరపాలని మంత్రి ఆదేశించారు.
నా పాత్ర లేదు: ఈడీ
‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తా కథనాల నేపథ్యంలో మెడికల్ కార్పొరేషన్ (ఏపీఎంఎ్‌సఐడీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమోహన్ శనివారం మంత్రిని కలిసి వివరణ ఇచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించిన సాంకేతిక ప్రమాణాల నిర్ధారణలో తనకు ఎలాంటి పాత్ర లేదని, కేవలం రెండు సందర్భాల్లో సాంకేతిక ప్రమాణాలను పునఃపరిశీలించాలని సూచించానని మంత్రికి తెలిపారు. డెంటల్ పేషెంట్ కుర్చీలకు సంబంధించి ఒక కంపెనీ పేరుతో వారి ప్రమాణాలను వైద్యులు సూచించగా, అవి నిబంధనలకు విరుద్ధం కనుక పునఃపరిశీలించాలని సూచించానని వివరించారు. అలాగే 16 స్లైస్‌తో కూడిన సిటీ స్కాన్ కొనుగోలుకు వైద్యులు సూచించగా, అలాంటి పరికరాల కొనుగోలు, సరఫరా తగ్గిన నేపథ్యంలో పునఃపరిశీలించాలని మాత్రమే సూచించానని, తాను అక్రమాలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు.
కార్పొరేషన్‌లో ప్రక్షాళన అవసరం
మెడికల్ కార్పొరేషన్‌లో వైద్య పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. నాణ్యతకు పాతరేస్తున్న అధికారులు తమకు నచ్చిన కంపెనీల నుంచి అవసరం లేకపోయినా పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఆరేడు నెలల నుంచి ఈ తంతు జరుగుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాల్లో ఏయే వైద్య పరికరాలను ఎంత మేరకు అధిక ధరలకు కొనుగోలు చేశారు, వాటి అసలు ధర ఎంత, ప్రభుత్వ నిధులు ఎంత మొత్తంలో దుర్వినియోగం చేశారు వంటి విషయాలను బహిర్గతం చేసింది. ఈ అక్రమాలపై ప్రత్యేక విచారణ చేయించాల్సిన అవసరం ఉంది. నివేదికలతో ప్రయోజనం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక విచారణ కమిటీని నియమించి మెడికల్ కార్పొరేషన్ ఇచ్చిన కొనుగోళ్ల ఆర్డర్లపై లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మెడికల్ కార్పొరేషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా మంత్రి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.