Share News

205 కోట్లు మురిగిపోయాయ్‌!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:59 AM

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) అధికారుల్లో నిర్లక్ష్యం ఏ మాత్రం పోలేదు. మొన్న పాడేరు మెడికల్‌ కాలేజీకి సంబంధించి 50 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసరుపెట్టిన అధికారులు.. ఇప్పుడు ఏకంగా రూ.205 కోట్ల నిధులను వదులుకునే పరిస్థితిని తీసుకువచ్చారు.

205 కోట్లు  మురిగిపోయాయ్‌!

  • డీఎంఈ అధికారుల నిర్లక్ష్యంతో కొరగాకుండా పోయిన కేంద్ర నిధులు

  • పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కాలేజీల్లో వైద్య పరికరాలకు 370 కోట్లు ఇచ్చిన కేంద్రం

  • వినియోగానికి మూడేళ్ల సమయం ఇచ్చినా 165 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన డీఎంఈ

  • 205 కోట్ల వినియోగానికి 20 రోజులే గడువు

  • ఇప్పటికిప్పుడు ఈస్థాయి ఖర్చు అసాధ్యం

  • నిధులు వెనక్కివెళ్లడం ఖాయమని నిర్ధారణ

డీఎంఈ అధికారుల నిర్లక్ష్యం.. వందల కోట్ల రూపాయలను ఎందుకూ కొరగాకుండా చేసింది!. చేతిలో సొమ్మున్నా.. ఖర్చు చేసుకునే అవకాశమున్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా సదరు నిధులు వెనక్కి వెళ్లిపోనున్నాయి. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, వైద్యపరికరాల కొనుగోలుకు కేంద్రం ఇచ్చిన రూ.370 కోట్లలో రూ.205 కోట్లను మురగబెట్టారు. కేంద్రం నిర్దేశించిన గడువు మరో 20 రోజుల్లో ముగియనుండడంతో ఈ సొమ్ము తిరిగి వెళ్లిపోనుంది. మూడు మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక అవకాశం చేజారిపోనుంది!.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) అధికారుల్లో నిర్లక్ష్యం ఏ మాత్రం పోలేదు. మొన్న పాడేరు మెడికల్‌ కాలేజీకి సంబంధించి 50 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసరుపెట్టిన అధికారులు.. ఇప్పుడు ఏకంగా రూ.205 కోట్ల నిధులను వదులుకునే పరిస్థితిని తీసుకువచ్చారు. ఒకవైపు మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను వినియోగించుకునే విషయంలో డీఎంఈ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. దీంతో వందల కోట్ల నిధులు వెనక్కి పోనున్నాయి. రాష్ట్రంలో నిర్మిస్తున్న పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఈ మూడు కాలేజీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 విధానంలో నిర్మిస్తున్నాయి.


వీటి నిర్మాణానికి కేంద్రం రూ.975 కోట్లు ఇచ్చింది. దీనిలో రూ.605 కోట్లు భవనాలు, ఇతర నిర్మాణాలకు కేటాయించింది. రూ.370 కోట్లను మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలుకు అందించింది. 2023లో కేటాయించిన ఈ నిధుల వినియోగానికి మూడేళ్ల కాలపరిమితి విధించింది. దీనిప్రకారం.. ఈ నెల 31 నాటికి గడువు తీరనుంది. అయితే, ఈ నిధుల్లో ఇప్పటి వరకు రూ.165 కోట్లు మాత్రమే అధికారులు ఖర్చు చేశారు. మిగిలిన రూ.205 కోట్లను ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. మరో 20 రోజుల్లో గడువు ముగుస్తుండడంతో ఈ నిధుల వ్యవహారంపై చర్చ సాగుతోంది.


పాడేరు విషయంలోనూ అంతే..

డీఎంఈ, పాడేరు మెడికల్‌ కాలేజీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ కళాశాలకు రావాల్సిన 50 ఎంబీబీఎస్‌ సీట్లు రాలేదు. 2025-26 ఏడాదికి 50 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా తెప్పించే అంశంపై ప్రభుత్వం, మంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. ఈక్రమంలో పాడేరు కళాశాల ప్రిన్సిపాల్‌ 2025-26 సంవత్సరానికి 50 సీట్లు అదనంగా మంజూరు చేయాలని ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. దీనిని పరిశీలించిన ఎన్‌ఎంసీ రెండు అంశాలపై వివరణ కోరింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నుంచి పొందిన కన్సెంట్‌ ఆఫ్‌ అఫిలియేషన్‌ను సరైన ఫార్మాట్‌లో పంపాలని, కళాశాల నిర్వహణకు సంబంధించిన వీడియో రికార్డులు ఇవ్వాలని సూచించింది. దీంతో పాడేరు కళాశాల ప్రిన్సిపాల్‌ ఈ రెండు విషయాలపై వివరణలను.. అప్పీళ్లను పరిశీలించే సెక్షన్‌కు కాకుండా వేరే విభాగానికి పంపించారు. ఫలితంగా వీటిని ఎన్‌ఎంసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అదనంగా కోరిన 50 ఎంబీబీఎస్‌ సీట్లు దక్కలేదు. తాజాగా రూ.కోట్ల నిధుల వినియోగంలోనూ అధికారుల నిర్లక్ష్యమే శాపంగా మారింది.


సీఎం చెప్పినా బేఖాతరు

కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఆ నిధులను వృథా చేయవద్దని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఖర్చు చేసేందుకు వీలుగా రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ను కూడా ఇస్తూనే ఉన్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో అధికారులు సీఎం మాటలను కూడా బేఖాతరు చేస్తున్నారనడానికి డీఎంఈ అధికారులే ఉదాహరణగా నిలిచారనే విమర్శలు వస్తున్నాయి.

పదే పదే హెచ్చరించినా

‘‘మూడు మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన వైద్య పరికరాల బడ్జెట్‌ను త్వరిగతిన ఖర్చు చేయండి.’’ అని డీఎంఈని కేంద్రం పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. అయినా అధికారులు ఈ నిధుల వినియోగంపై దృష్టి పెట్టలేదు. మరోవైపు మచిలీపట్నం, పాడేరు మెడికల్‌ కాలేజీల్లో రెండేళ్ల నుంచి అడ్మిషన్లు నడుస్తున్నాయి. ఈ ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థులు మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంది. దీనికిగాను సుమారు రూ.80 కోట్ల వరకు ఖర్చుకానుంది. అయితే.. కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించి వీటిని కొనుగోలు చేసేందుకు, ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచేందుకు సమయం సరిపోదు. ఫలితంగా.. ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడనుంది.

Updated Date - Mar 11 , 2026 | 05:01 AM