ఏడాది ‘ ఇంటర్న్‌షిప్’ పరిగణనలోకి
ABN , Publish Date - Aug 20 , 2026 | 04:01 AM
విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించి ఏడాది ఇంటర్న్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకున్నామని ఏపీ మెడికల్ కౌన్సిల్ సుప్రీంకోర్టుకు నివేదించింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు పాటిస్తున్నాం
సుప్రీంకోర్టులో ఏపీ మెడికల్ కౌన్సిల్ వెల్లడి
2020-21 కరోనా సమయంలో విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు వర్తింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధించి ఏడాది ఇంటర్న్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకున్నామని ఏపీ మెడికల్ కౌన్సిల్ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా 2020-21 సమయంలో విదేశాల్లో (ముఖ్యంగా చైనా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో) ఎంబీబీఎస్ చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగివచ్చారు. ఆ సమయంలో అక్కడి యూనివర్సిటీలు వీరికి ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహించాయి. వైద్య విద్య అనేది ప్రాక్టికల్స్‌తో కూడుకున్నది కావడంతో ఆన్‌లైన్ చదువుపై నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు భారత్‌లో ప్రాక్టీస్ చేయాలంటే గతంలో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేేస్త సరిపోయేది. అయితే ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థులు క్లినికల్ నైపుణ్యాలు కోల్పోయారని భావించిన ఎన్‌ఎంసీ.. అటువంటి వారు రెండేళ్ల పాటు ఇంటర్న్‌షిప్ చేయాలనే నిబంధన పెట్టింది. దీనిపై కట్టా వంశీతో పాటు మరికొందరు విద్యార్థులు తాము ఆన్‌లైన్ క్లాసుల వల్ల కోల్పోయిన ప్రాక్టికల్స్‌ను తర్వాత విదేశీ యూనివర్సిటీలకు వెళ్లి ఆఫ్‌లైన్ ద్వారా పూర్తి చేశామని (కంపెన్షన్) సర్టిఫికెట్లు సమర్పించారు. ఆ సర్టిఫికెట్లను ప్రామాణికంగా తీసుకోలేమని, అవి నమ్మదగినవి కావని మెడికల్ కౌన్సిల్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి మెడికల్ కౌన్సిల్‌కు అనుకూలంగా తీర్పునివ్వగా, డివిజన్ బెంచ్ మాత్రం విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ఏపీ మెడికల్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్ బుధవారం జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు పిటిషనర్లకు రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ పెండింగ్‌లో ఉందని, దానిపై విచారణను ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థుల తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ధిక్కరణ పిటిషన్ అంశంపై హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది.