Share News

టెండర్‌కే ‘టెండర్‌’

ABN , Publish Date - May 11 , 2026 | 03:43 AM

ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.340 కోట్ల టెండర్‌ డాక్యుమెంట్‌ బయటికి వచ్చింది. శుక్రవారం ఢిల్లీకి చెందిన అస్మదీయ కంపెనీకి దాన్ని అప్పగించేశారు.

టెండర్‌కే ‘టెండర్‌’

  • మెడికల్‌ కార్పొరేషన్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు

  • 340 కోట్ల టెండర్‌ డాక్యుమెంట్‌ బయటికి

  • అస్మదీయ ఢిల్లీ కంపెనీకి అప్పగించిన అధికారులు

  • మాన్యుఫాక్చరర్స్‌తో ఆ కంపెనీ బేరసారాలు

  • గత శుక్రవారమే లీక్‌.. వాట్సా్‌పలో సర్క్యులేట్‌

  • సీఎంవో ఆరా తీస్తున్నా అధికారులు బేఖాతర్‌

  • అస్మదీయ కంపెనీకి ఆర్డర్లు వచ్చేలా స్కెచ్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రూ.340 కోట్ల టెండర్‌ డాక్యుమెంట్‌ బయటికి వచ్చింది. శుక్రవారం ఢిల్లీకి చెందిన అస్మదీయ కంపెనీకి దాన్ని అప్పగించేశారు. ఈ వారంలో టెండర్‌ పిలిచేందుకు కార్పొరేషన్‌లో డ్రగ్స్‌ విభాగం అధికారులు సిద్ధమయ్యారు. టెండర్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేశారు. దీన్ని కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడమే తరువాయి. ఈలోగా డాక్యుమెంట్‌ ఢిల్లీకి చెందిన కంపెనీ చేతికి వెళ్లిపోయింది. డాక్యుమెంట్‌ బహిర్గతం కావడంతో సప్లయిర్స్‌ షాకవుతున్నారు. సప్లయిర్స్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో ఇది సర్క్యులేట్‌ అవుతోంది. ఢిల్లీకి చెందిన కంపెనీ ప్రతినిధులు అన్ని మ్యానుఫ్యాక్చరర్‌ కంపెనీలను సంప్రదించి.. ‘మీ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టులు ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌కు సరఫరా చేస్తాం. ధర ఎంత తగ్గిస్తారు’ అంటూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. పైగా టెండర్‌ డాక్యుమెంట్‌ను చూపించి ఇందులో ఏమైనా స్పెసిఫికేషన్స్‌ మార్చాలన్నా తమకు క్షణంలో పని అని, తాము ఏపీలో ఏదైనా చేయగలమని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ కంపెనీ ఢిల్లీ డీల్స్‌ అధికారికి, డ్రగ్స్‌ విభాగంలోని చిరుద్యోగికి అస్మదీయ కంపెనీ. డాక్యుమెంట్‌ బహిర్గతం కావడంతో టెండర్‌ నిబంధనలు బయటికి వచ్చేశాయి. కార్పొరేషన్‌ అధికారులు తమ పర్సంటేజ్‌ల కోసం పారదర్శకతకు నీళ్లు వదిలేస్తున్నారు.


118 సర్జికల్స్‌ లిస్ట్‌ బయటికి

బహిర్గతమైన టెండర్‌ డాక్యుమెంట్‌ 118 సర్జికల్స్‌ ఐటమ్స్‌కు సంబంధించినది. మెడికల్‌ కార్పొరేషన్‌ ప్రతి రెండేళ్లకు ఒకసారి అవసరమైన సర్జికల్‌ లిస్ట్‌ను సిద్ధం చేస్తుంది. ఆ లిస్ట్‌లో ఉన్న సర్జికల్‌ ఐటమ్స్‌కు సంబంధించిన రెండేళ్ల రేటు కాంట్రాక్ట్‌ కోసం టెండర్లు ఆహ్వానిస్తుంది. కాంట్రాక్ట్‌ పొందిన కంపెనీలు మాత్రమే వాటిని సరఫరా చేయాలి. కార్పొరేషన్‌ అధికారులు ప్రతి ఏటా దాదాపు రూ.170 కోట్ల విలువైన సర్జికల్‌ ఐటమ్స్‌ కొనుగోలు చేస్తారు. రెండేళ్లకు దాదాపు రూ.340 కోట్ల విలువైన సర్జికల్‌ ఐటమ్స్‌ కొనుగోలుకు పీవోలు ఇస్తారు. రెండేళ్ల రేటు కాంట్రాక్ట్‌ కోసం పిలిచిన టెండర్లలో రెండు, మూడు సర్జికల్‌ ఐటమ్స్‌కు సంబంధించి ఎల్‌ 1 వచ్చినా చాలని చాలా కంపెనీలు ఎదురుచూస్తుంటాయి. ఒక్కసారి కాంట్రాక్ట్‌ వస్తే దాదాపు రూ.5-6 కోట్ల విలువైన ఆర్డర్లు వస్తాయి. తొలి నుంచి ఢిల్లీ కంపెనీతో లావాదేవీలు జరుపుతున్న కార్పొరేషన్‌ అధికారులు ఆ కంపెనీకి ఏడాదికి దాదాపు రూ.30-40 కోట్ల ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పర్సంటేజ్‌లు ఎక్కువ ఇచ్చే కంపెనీ కావడంతో అధికారులకు భారీగా ముడుతుంది. కాబట్టి టెండర్‌ డాక్యుమెంట్‌ను ముందుగానే ఆ కంపెనీకి అప్పగించేశారు. ఆ కంపెనీ సాధ్యమైనన్ని సర్జికల్‌ ఐటమ్స్‌ను టెండర్‌లో కోట్‌ చేసుకుని, రేటు కాంట్రాక్ట్‌లోకి తీసుకువచ్చే విధంగా ప్లాన్‌ చేశారు. అస్మదీయ కంపెనీ చేతికి ఇప్పటికే అనేక సార్లు టెండర్‌ డాక్యుమెంట్లు అప్పగించినట్లు తెలుస్తోంది.


ఆరేడు నెలలుగా ఇదే తంతు

ఏ శాఖలో అయినా టెండర్‌ డాక్యుమెంట్లను అత్యంత గోప్యంగా ఉంచుతారు. వాటిని బహిర్గతం చేయడం వల్ల పారదర్శకత లోపించడంతో పాటు కొన్ని కంపెనీలకు మేలు జరిగే అవకాశముంది. కానీ మెడికల్‌ కార్పొరేషన్‌లో అంతా రివర్స్‌. కార్పొరేషన్‌ అధికారులు కొన్ని కంపెనీలకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మెడికల్‌ కార్పొరేషన్‌లో అవినీతిపై కోకోల్లలుగా కథనాలు వస్తున్నాయి. అక్రమాలపై సీఎంవో ప్రత్యేక నిఘా పెట్టింది. అధికారుల పనితీరుపై అంతర్గత విచారణలు నడుస్తున్నాయి. అయినా అధికారులు ఎవరు ఏమైనా చేసుకోనీ తమ పని తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మెడికల్‌ కార్పొరేషన్‌ ఏ టెండర్‌ పిలిచినా ఢిల్లీ డీల్స్‌ అధికారి అస్మదీయ కంపెనీ చేతికి డాక్యుమెంట్లు ముందే వెళ్లిపోతున్నాయి. దీంతో కంపెనీ ప్రతినిధులు వైద్య పరికరాల తయారు చేసే కంపెనీలతో ముందస్తుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు మ్యానుఫ్యాక్చరర్‌ కంపెనీలతో చర్చల సందర్భంగా ఏదైనా స్పెసిఫికేషన్స్‌ మార్చాల్సి వస్తే.. కంపెనీ ప్రతినిధులు వెంటనే కార్పొరేషన్‌ అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు వెంటనే మార్చేసి కంపెనీ కోరిన విధంగా టెండర్‌ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆరేడు నెలలుగా ఇదే తంతు జరుగుతోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - May 11 , 2026 | 03:44 AM