కమీషన్ల కక్కుర్తితో క్వాలిటీ గాలికి!
ABN , Publish Date - May 09 , 2026 | 04:03 AM
ప్రభుత్వానికి తిరుమల పవిత్రత ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయానికి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది.
వైద్య పరికరాల కొనుగోలులో అక్రమాలు
మెడికల్ కార్పొరేషన్‌లో పర్సంటేజ్‌ల పర్వం
పరికరం నాణ్యత శూన్యం.. ధర అత్యధికం
69 లక్షల ఎక్స్‌రే మెషిన్ 1.2 కోట్లకు కొన్నారు
6 మెషిన్లకు ఐదు కోట్లు సమర్పయామి
93 లక్షల మామోగ్రఫీ 1.71 కోట్లకు
4 మెషిన్లకు అదనంగా 2 కోట్లు చెల్లింపు
ఢిల్లీ డీల్స్ అధికారి, ఎక్విప్‌మెంట్ అధికారికి కమీషన్లు
వైద్యులను బెదిరించి మరీ అనుమతులు
మరో 39 కోట్ల టెండర్లలోనూ ఇదేతీరు
విచారణ చేయిస్తే అక్రమాలు వెలుగులోకి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వానికి తిరుమల పవిత్రత ఎంత ముఖ్యమో.. ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆలయానికి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి అక్రమార్కులపై చర్యలకు ఉపక్రమించింది. మరి.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నాణ్యత లేని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్న అవినీతి అధికారులపై చర్యలేవీ? మెడికల్ కార్పొరేషన్‌లో అంతా పర్సంటేజ్‌ల పర్వం. కమీషన్లకు కక్కుర్తిపడుతున్న అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే మంచి మందులు, నాణ్యమైన వైద్య పరికరాలు ఆస్పత్రుల్లో ఉండాలి. ఇప్పటికే రోగులకు అవసరమైన మందులు ఆరోగ్య శాఖ ఇవ్వలేకపోతోంది. ఇప్పుడు నాణ్యమైన వైద్య పరికరాలనూ అందించలేని స్థితికి అధికారులు తీసుకువచ్చారు. ఏ వైద్య పరికరం కొనుగోలు చేయాలన్నా.. ‘నాకేంటి లాభం’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్య పరికరాలు సరఫరా చేసే జాతీయ, అంతర్జాతీయ బ్రాండెడ్ కంపెనీలు ఏపీలో టెండర్లు వేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నాయి. అధికారులు అడిగే కమీషన్లు ఇవ్వలేమని, ఏపీలో క్వాలిటీ కంటే కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ఢిల్లీ డీల్స్ అధికారి ఆరోగ్య శాఖకు వచ్చినప్పటి నుంచి కమీషన్లకు కక్కుర్తిపడి వైద్య పరికరాల నాణ్యతను గాలికొదిలేశారు. ఆయనకు తోడు ఎక్విప్‌మెంట్ విభాగం అధికారి మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారు. పర్సంటేజ్‌లు ఇచ్చిన కంపెనీల నుంచి మాత్రమే వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. పైగా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక ధరలకు తీసుకుంటున్నారు. టెండర్లలో ఆయా కంపెనీలు ఎంపిక కాకపోయినా.. అర్హత సాధించేలా చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలులో క్విడ్ ప్రోకో
వైద్య పరికరాల కొనుగోలులో అధికారులు క్విడ్ ప్రోకో విధానాన్ని పాటిస్తున్నారు. గత ఏడాది మార్చిలో మెడికల్ కార్పొరేషన్ అధికారులు ఆరు మామోగ్రఫీలు, నాలుగు 800 ఎంఏ డిజిటల్ ఎక్స్‌రే యంత్రాల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించారు. ఈ రెండు రకాల పరికరాల కొనుగోలు టెండర్లలో ఒక కంపెనీ మాత్రమే పాల్గొంది. దీంతో ఆ టెండర్ రద్దు చేసి మరోసారి మే నెలలో టెండర్లు పిలిచారు. ఇందులో మామోగ్రఫీకి ఒక కంపెనీ, 800 ఎంఏ డిజిటల్ ఎక్స్‌రే యంత్రానికి మరో కంపెనీ బిడ్ దాఖలు చేశాయి. దీనిని కూడా సింగిల్ టెండర్‌గానే పరిగణించాలి. కానీ ఎక్విప్‌మెంట్ అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా పీవో (పర్చేస్ ఆర్డర్లు) ఇచ్చేశారు. ఇందులో ఢిల్లీ డీల్స్ అధికారికి అత్యధిక పర్సంటేజ్‌లు ఇచ్చే కంపెనీ ఉంది. పర్సంటేజ్‌లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేటు పెట్టి ఆ కంపెనీ నుంచి కొన్నారు. అంటే.. క్విడ్ ప్రోకో అన్నమాట. సాధారణంగా మామోగ్రఫీ యంత్రం ధర రూ.93.18 లక్షలు మాత్రమే. తమిళనాడులో ఇంతే ధరకు కొనుగోలు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం అధికారులు ఒక్కో యంత్రాన్ని రూ.1.71 కోట్లకు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ లెక్కన ఆరు యంత్రాలను రూ.10.26 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఆమోదించి ఆర్డర్లు ఇచ్చారు. అంటే.. అసలు ధర కంటే దాదాపు ఐదు కోట్లు ఎక్కువ. అలాగే నాలుగు 800 ఎంఏ డిజిటల్ ఎక్స్‌రే యంత్రాలను కూడా అత్యధిక ధర పెట్టి కొన్నారు. ఈ యంత్రాన్ని తమిళనాడులో రూ.69.44 లక్షలకు కొనుగోలు చేశారు. మన దగ్గర మాత్రం ఒక్కోదాని ధర రూ.1.23 కోట్లు. రూ.2.77 కోట్లకు కొనుగోలు చేయాల్సిన నాలుగు యంత్రాలకు రూ.4.94 కోట్లు పెట్టారు. అదనంగా రూ.2.20 కోట్లు చెల్లించారు. కేవలం ఈ రెండు రకాల పరికరాల కొ నుగోలులోనే ప్రభుత్వ నిధులను రూ.8 కోట్ల వరకూ అప్పనంగా కంపెనీలకు అప్పగించారు.
ఆస్పత్రులకు అవసరం లేకపోయినా కొనుగోలు చేసి కంపెనీలకు లబ్ధి చేకూర్చారు. అధికారులకు రావాల్సిన వాటా బ్యాక్ డోర్‌లో అందింది. ఇలా పదుల సంఖ్యలో వైద్య పరికరాలను క్విడ్ ప్రోకో విధానంలో కొనుగోలు చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. వ్యాక్యుమ్ ఎక్స్‌ట్రాక్టర్స్, రెండు బాడీ మార్చురీలు, వంద చెస్ట్ ఎక్స్‌రే యంత్రాలు, 30 డెంటల్ చైర్స్, ఎండోస్కోపీ యంత్రాల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. డీఎ్‌సహెచ్ ఆస్పత్రులకు అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నీచర్ కొనుగోలులో కూడా భారీ అక్రమాలు జరిగాయి. దాదాపు రూ.39 కోట్ల విలువైన టెండర్లలో కోట్లల్లో దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
వైద్యులను బెదిరించి మరీ..
ఢిల్లీ డీల్స్ అధికారి, ఎక్వి్‌పమెంట్ విభాగంలో ఉండే అధికారి దెబ్బకు ప్రభుత్వ వైద్యులు హడలిపోతున్నారు. నిబంధనల ప్రకారం వైద్య పరికరాల కొనుగోలులో వైద్యులదే తుది నిర్ణయం. ఏ మోడల్ పరికరం కొనాలి, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మొత్తం వైద్యులు నిర్ణయిస్తారు. వారి నిర్ణయం మేరకే ఏపీఎంఎ్‌సఐడీ కొనుగోలు చేయాలి. మెడికల్ కార్పొరేషన్ అధికారి ఇందులో జోక్యం చేసుకోవడానికి లేదు. కానీ మెడికల్ కార్పొరేషన్‌లో అంతా రివర్స్‌లో జరుగుతోంది. కార్పొరేషన్‌లో వైద్యులు కోరిన పరికరాలను 10 శాతం కూడా కొనుగోలు చేయడం లేదు. అధికారులకు ఎక్కువ పర్సంటేజ్ ఏ కంపెనీ ఇస్తే దానికి సంబంధించిన వైద్య పరికరాలనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నాణ్యమైన వైద్య పరికరాలు ఆస్పత్రులకు అందడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పరికరాలు మూలకు చేరుతున్నాయి. వైద్య పరికరాల కొనుగోలులో డెమో అనేది కీలకం. టెండర్ పిలిచిన తర్వాత టెక్నికల్ ఎవల్యూషన్‌తో పాటు డెమో నిర్వహిస్తారు. వైద్యులు పరికరాలను క్షుణ్నంగా పరిశీలించి, వారు కోరిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఉంటేనే ఆ కంపెనీలకు అర్హత కల్పిస్తారు. లేకుంటే డిస్‌క్వాలిఫై చేస్తారు. అయితే ఢిల్లీ డీల్స్ అధికారి, ఎక్విప్‌మెంట్ విభాగం అధికారి తాము చెప్పిన కంపెనీలకు అర్హత కల్పించాలని వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారు. వారి ఆదేశాలతో బయో మెడికల్ ఇంజనీర్లు డెమోకు వచ్చిన వైద్యులతో ముందే మాట్లాడి, ఆయా కంపెనీల పేర్లు చెబుతున్నారు. వివిధ మార్గాల నుంచి సిఫారసులు చేయిస్తున్నారు. అప్పటికీ వినకపోతే భయపెడతారు. వైద్యులు ఈ గోల మనకెందుకని భయపడి వారు చెప్పిన కంపెనీలను ఎంపిక చేస్తున్నారు.
డీఎంఈకి వైద్యుల లేఖలు
ఉన్నతాధికారులు చెప్పిన కంపెనీలను ఎంపిక చేసేందుకు, డెమోలో వారు చెప్పిన వైద్య పరికరాలకు అనుమతులు ఇచ్చేందుకు తామెందుకు రావడమని కొందరు వైద్యులు అడ్డు చెబుతున్నారు. ‘మీ డెమోలు మీరే నిర్వహించుకోండి.. మీరే ఆ వైద్య పరికరాలను వాడుకోండి’ అని మొహం మీదనే చెప్పేస్తున్నారు. డెమోలకు తమను పిలవొద్దని రెండు వారాల క్రితం డీఎంఈకి లేఖలు రాశారు. సెకండరీ హెల్త్‌లో కూడా కొంత మంది వైద్యులు లేఖలు రాయడానికి సిద్ధమవుతున్నారు. అధికారులు చేసిన తప్పులకు తాము బలైపోతున్నామని భావిస్తున్నారు. వైద్య పరికరాలు వాడాల్సిన వైద్యుల సూచనలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు దారుణంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. వైద్య పరికరాల కొనుగోలులో వైద్యులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి వస్తాయి. రోగులకు మెరుగైన సేవలు అందుతాయి.