పైసలిస్తేనే పనులు
ABN , Publish Date - May 07 , 2026 | 03:42 AM
క్యాన్సర్ కణం శరీరంలో ఏదైనా ఒక అవయవంలో చిన్నగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి మరికొన్ని కణాల్ని పోగేసుకుని పెద్ద కణితిగా మారి ప్రాణాంతకమవుతుంది. అచ్చం అలాగే.. ఆరోగ్య శాఖలో ..
మెడికల్ కార్పొరేషన్‌లో ముదిరిన
అవినీతిపీవో సహా ప్రతి పనికీ పర్సంటేజ్ ఇవ్వాల్సిందే
సీటు, సీటుకూ ముడుపులు ముట్టజెప్పాలి
ఢిల్లీలో డీల్స్ చేసే అధికారికి 4 నుంచి 5శాతం
వైద్య పరికరాల విభాగంలో అధికారికి 3శాతం
డ్రగ్స్ విభాగంలో డిమాండ్ చేసినంత
బయో మెడికల్ ఇంజనీర్లకు 1.5శాతం
బిల్లులు పెట్టాలంటే ఫైనాన్స్ విభాగంలో 2శాతం
గడువు ముగిసినా వెళ్లని ఎక్వి్‌పమెంట్ అధికారి
ప్రభుత్వం ప్రక్షాళన చేయాల్సిన సమయమిది
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
క్యాన్సర్ కణం శరీరంలో ఏదైనా ఒక అవయవంలో చిన్నగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి మరికొన్ని కణాల్ని పోగేసుకుని పెద్ద కణితిగా మారి ప్రాణాంతకమవుతుంది. అచ్చం అలాగే.. ఆరోగ్య శాఖలో అవినీతి క్యాన్సర్ కణం మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ)లో ప్రారంభమైంది. అది నెమ్మదిగా పెద్దదై ఆరోగ్య శాఖను, తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని మింగేసేలా ఉంది. ప్రభుత్వం వెంటనే మేల్కొని దీనిని కంట్రోల్ చేయాల్సిన అవసరముంది. లేకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. ఏపీఎంఎస్ఐడీసీలో అవినీతి పర్సంటేజ్‌ల్లో నడుస్తోంది. మందులు, సర్జికల్ ఐటమ్స్, వైద్య పరికరాలు, పీపీపీ టెండర్లు.. ఇలా దేనికైనా ముడుపులు ఇవ్వాల్సిందే. అసలు కాంట్రాక్టర్లకు పీవో(పర్చేజ్ ఆర్డర్) కావాలంటే పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. లేకుంటే పీవో కాదు కదా కాంట్రాక్టర్‌ను కార్పొరేషన్ మెట్లు కూడా ఎక్కనివ్వరు. ఇది మెడికల్ కార్పొరేషన్‌లో రూల్ అంతే. కార్పొరేషన్‌లో తపాల సెక్షన్ నుంచే అవినీతి మొదలైంది. కింది స్థాయి నుంచి సచివాలయం స్థాయి వరకూ పర్సంటేజ్‌ల మెనూ నడుస్తోంది. ఢిల్లీలో డీల్స్ చేసుకునే ఉన్నతాధికారికి 4 నుంచి 5 శాతం ఇవ్వాలి. కార్పొరేషన్‌లో ఎక్వి్‌పమెంట్ వ్యవహారాలు చూసే అధికారికి 3 శాతం, డ్రగ్స్ వ్యవహారాలు చక్కదిద్దే చిరుద్యోగికి కనీసం 5 శాతం ఇవ్వకుంటే మొహం కూడా చూడరు. ఇక కింది స్థాయిలో బయో మెడికల్ ఇంజనీర్లకు 1.5 శాతం, బిల్లులు పెట్టాలంటే కార్పొరేషన్ ఫైనాన్స్ విభాగంలో 2 శాతం ముట్టజెప్పాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. టేబుల్, టేబుల్‌కూ చేతులు తడపకపోతే ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా, సప్లయిర్ అయినా జాంతానై అన్నట్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్ చుట్టూ బొంగరంలా తిరగాల్సిందే తప్ప, వారి పని మాత్రం చేయరు.
భయపెట్టి.. పనిచేయిస్తారు
ఢిల్లీలో డీల్స్ చేసే ఉన్నతాధికారి వసూళ్లలో ప్రత్యేక విధానాన్ని పాటిస్తున్నారు. ఆయనది అంతా భయపెట్టి పని చేయించే పద్ధతి. ఏపీలో మూడో కంటికి తెలియకుండా ఢిల్లీలో శని, ఆదివారాల్లో బేరాలు కుదుర్చుకుంటారు. సోమవారం ఉదయం ద్వితీయ స్థాయి అధికారులు, కింది స్థాయి సిబ్బందిపై తిట్లదండకం ప్రారంభిస్తారు. ఆయన ఎందుకు తిడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ‘మిమ్మల్ని సరెండర్ చేస్తా.. సస్పెండ్ చేస్తా’ అంటూ భయపెడతారు. చివరికి తనకు కావాల్సిన ఫైళ్లను నెమ్మదిగా అడుగుతారు. డీల్ కుదిరిన కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చేలా, ఆయా కంపెనీలే టెండర్లలో ఎంపికయ్యేలా చేయిస్తారు. అధికారులు, సిబ్బంది కూడా ఆయనతో మళ్లీ ఎందుకు తిట్టించుకోవడం, చెప్పింది చేసేద్దాం అన్న ఆలోచనకు వచ్చేలా సదరు అధికారి చేస్తారు. ఆ అధికారి 4 నుంచి 5 శాతం పర్సంటేజ్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తన పర్సంటేజ్ ఢిల్లీలో అందజేస్తే ఏపీలో పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చేస్తారు. అవసరం లేకున్నా సిమ్యులేటర్లను రూ.13.2 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అలాగే డీఎంఈ నుంచి ఇండెంట్ రాకుండా హిస్టెరోస్కోపీకి సంబంధించిన రేటు కాంట్రాక్ట్‌కు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. వీటిలో ఢిల్లీ సార్‌కు భారీగా ముడుపులు అందినట్లు తెలుస్తోంది. అలాగే ఎక్స్‌రే మిషన్లు, మామోగ్రఫీకి సంబంధించిన పీవోల్లో కూడా భారీగానే వసూళ్లు చేశారు. వెంటిలేటర్ల కొనుగోలుకు సంబంధించి నాలుగు కంపెనీలకు రీ-డెమోకు అనుమతులిచ్చి, అర్హత కల్పించినందుకు భారీగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్‌లో ‘కృష్ణ’లీలలు
కార్పొరేషన్‌లో ఎక్వి్‌పమెంట్ విభాగం చూసే అధికారి లీలలు అన్నీ ఇన్నీ కావు. ఆరోగ్య శాఖలో డీఎంఈ(డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్), డీఎస్‌హెచ్ (డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్), డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్), నేషనల్ హెల్త్ మిషన్ వంటి విభాగాల నుంచి వచ్చిన ఇండెంట్ ఆధారంగానే వైద్య పరికరాలు కొనుగోలు చేయాలి. పైగా ఆయా వైద్య పరికరాలను ఉపయోగించే డాక్టర్లు ఏ మోడల్ కావాలని నిర్ణయిస్తారో వాటినే కొనుగోలు చేయాలి. కానీ ఈ విభాగంలోని అధికారికి డీఎంఈ, డీఎ్‌సహెచ్, డీహెచ్‌లకు సంబంధించిన విభాగాధిపతుల నుంచి ఇండెంట్లు ఏమీ అవసరం లేదు. ఆస్పత్రుల్లో ఏ వైద్య పరికరం వాడాలో సదరు అధికారే నిర్ణయించేసి దానికి అనుగుణంగా టెండర్లు పిలుస్తారు. టెండర్లు పిలిచిన తర్వాతే ఆయా విభాగాధిపతులకు సమాచారం ఇస్తారు. ఎక్వి్‌పమెంట్ విభాగం కొనుగోలు చేసే వైద్య పరికరాలు విభాగాధిపతులకు, చివరికి వాటిని ఉపయోగించే వైద్యులకు నచ్చినా, నచ్చకపోయినా బలవంతంగా తీసుకోవాల్సిందే. సదరు అధికారికి మందులు, వైద్య పరికరాల మోడల్స్‌పై అంతగా అవగాహన లేదు. పెద్దల సిఫారసుతో కార్పొరేషన్‌లోకి ఎంటర్ అయిన ఆయన కొంతమంది బయో మెడికల్ ఇంజనీర్లతో సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన టీమ్ ద్వారా మొత్తం వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఎక్వి్‌పమెంట్‌కు సంబంధించి ఏ పీవో ఇవ్వాలన్నా అధికారికి 3 శాతం పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. ఈ మధ్య కాలంలో ఒక ప్రజాప్రతినిధికి, సదరు అధికారికి మధ్య చిన్న గలాట జరగడంతో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కొంతమంది బయో మెడికల్ ఇంజనీర్లను కార్పొరేషన్ నుంచి తొలగించారు. సదరు అధికారి తనను ఈ పోస్ట్‌లోకి సిఫారసు చేసిన పెద్దాయన దగ్గర కూర్చొని మరీ తొలగించిన బయో మెడికల్ ఇంజనీర్లను తిరిగి రప్పించుకున్నారు. షరా మామూలుగా పర్సంటేజ్‌లను వసూలు చేసుకుంటున్నారు. ఆయనకు ఇచ్చే 3 శాతం కాకుండా బయో మెడికల్ ఇంజనీర్లకు అదనంగా 1.5 శాతం పర్సంటేజ్ ఇవ్వాలన్న కండీషన్ కూడా పెట్టారు. ఆ అధికారికి తన శాఖ ఇచ్చిన గడువు గత ఏడాది నవంబరులోనే ముగిసినా కార్పొరేషన్‌లోనే కొనసాగుతున్నారు. పర్సంటేజ్‌లకు అలవాటు పడిన ఆయన కార్పొరేషన్‌ను ‘వదలబొమ్మాలి’ అంటున్నారు.
డ్రగ్స్‌లో ‘జాదూ’
మెడికల్ కార్పొరేషన్‌లోని డ్రగ్స్ విభాగంలో అవినీతి తారస్థాయికి చేరింది. కోట్ల రూపాయల డ్రగ్స్ బడ్జెట్‌పై ప్రతి అధికారి కన్నేశారు. ఆస్పత్రుల్లో మందులున్నాయా? వైద్యులు రాసిన మందులు రోగులకు ఇస్తున్నారా? లేదా? అన్నది ఏ అధికారికి పట్టడం లేదు. ‘పీవో ఇస్తే నాకేమిస్తావు’ అన్న ఆలోచనే తప్ప ప్రజల ఆరోగ్యం గురించి మాత్రం పట్టడం లేదు. ‘జాదూ’ ఉద్యోగి తీరుతో డ్రగ్స్ విభాగం భ్రష్టుపట్టింది. అన్ని పోస్టులు తనకే కావాలంటూ మొత్తం విభాగాన్ని ఆయన గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆ విభాగంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారిపోయింది. ఉన్నతాధికారులు కూడా ముందూ వెనుకా ఆలోచించకుండా కీలకమైన విభాగాన్ని సదరు ఉద్యోగి చేతుల్లో పెట్టారు. దీంతో తనను అడిగేవారే లేరన్న ధైర్యంతో ఏకంగా దాదాపు 10 మందుల కంపెనీలకు ఆయనే లైజనింగ్ చేసుకుంటున్నారు. తాను లైజనింగ్ చేసుకునే కంపెనీలకే మందుల కొనుగోలుకు సంబంధించి పీవో ఇవ్వడం, లక్ష టాబ్లెట్లు కొనాల్సిన చోట పది లక్షల టాబ్లెట్లు కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇతర కంపెనీకి పీవో ఇవ్వాలంటే తాను డిమాండ్ చేసిన పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. కార్పొరేషన్‌లో అత్యధికంగా ముడుపులు తీసుకునే కలెక్షన్ కింగ్‌గా సదరు ఉద్యోగి పేరు సంపాదించారు. ఇక ఫైనాన్స్ విభాగంలో బిల్లులు అప్‌లోడ్ చేయాలంటే దాదాపు 2 శాతం డిమాండ్ చేస్తున్నారు. ముడుపులు ఇస్తేనే బిల్లులు ప్రభుత్వానికి పంపిస్తామన్న ధోరణితో అధికారులు వ్యహరిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మొత్తం కార్పొరేషన్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.