Share News

జీవో 102పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నో

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:05 AM

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు.. ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన జీవో నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది.

జీవో 102పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నో

  • అందుకు కారణాలు కనిపించడం లేదన్న న్యాయస్థానం

  • ఈ జీవోతో రిజర్వుడు క్యాటగిరీ అభ్యర్థులకు నష్టమన్న పిటిషనర్‌

  • అది పిటిషనర్‌ ఆందోళన మాత్రమేనన్న హెల్త్‌ వర్సిటీ

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు.. ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన జీవో నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కారణాలు కనిపించడం లేదని తెలిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌లో అన్ని సీట్లకూ కలిపి ఒకేసారి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చే విధానాన్ని రద్దు చేసి.. ప్రతీ విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఈ ఏడాది జూలై 30న ఇచ్చిన జీవో 102ను సవాల్‌ చేస్తూ డాక్టర్‌ ఆల వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌ వాదనలు వినిపిస్తూ.. జీవో 102తో ప్రతి విడత కౌన్సెలింగ్‌కి ముందు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకొనేందుకు అవకాశం కల్పించారని, దీనివల్ల ప్రతిభావంతులైన రిజర్వుడు కేటగిరీ విద్యార్థులు ఓపెన్‌ క్యాటగిరీ సీట్లు పొందే అవకాశం కోల్పోతారన్నారు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ తరఫు న్యాయవాది టీవీ శ్రీదేవి, ప్రొఫెసర్‌ కృష్ణ చైతన్య వాదనలు వినిపిస్తూ... ఒక్కసారి మాత్రమే వెబ్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని పలు వ్యాజ్యాలలో హైకోర్టు తప్పుపట్టిందన్నారు.


దీంతో ప్రతి విడత కౌన్సెలింగ్‌కూ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకొనేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో 102 ఇచ్చిందన్నారు. ఈ జీవో కారణంగా రిజర్వుడు క్యాటగిరీ మెరిట్‌ అభ్యర్థులు నష్టపోతారనేది పిటిషనర్‌ ఆందోళన మాత్రమేనన్నారు. ఈ జీవో కారణంగా ఏ విద్యార్ధికీ నష్టం జరగదన్నారు. కాగా, ఇదే జీవోను సవాల్‌ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌ దాఖలు చేసిన పిల్‌లో హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

Updated Date - Aug 14 , 2026 | 05:06 AM