Share News

692 చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారం

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:28 AM

చెక్‌ బౌన్స్‌ కేసులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది.

692 చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారం

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): చెక్‌ బౌన్స్‌ కేసులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే 692 కేసులు పరిష్కరించి మొత్తం రూ 24.27 కోట్ల పరిహారం అందజేశారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ లిసాగిల్‌, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మార్గదర్శకంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానాల్లో 207 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. శనివారం సాయంత్రానికి ఇరువర్గాల ఆమోదం మేరకు 683 కేసులను పరిష్కరించారు. మరోవైపు ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ మండవ కిరణ్మయి పాల్గొన్నారు. 9 కేసులు పరిష్కరించి రూ.49.10 లక్షల పరిహారం అందజేశారు.

Updated Date - Jul 19 , 2026 | 03:29 AM