స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ భేటీ
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:52 AM
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులతో గురువారం సమావేశమయ్యారు.
ముందస్తు ఏర్పాట్లపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో చర్చ
పెండింగ్ కేసులు, రిజర్వేషన్లపైనా..
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లుపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఏమేం ఏర్పాట్లు చేశారు.. ఇంకా ఏం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.. వాటి పూర్తికి ఏం చర్యలు తీసుకున్నారో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికలు జరగలేదని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ఎన్నికల ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పురపాలక అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితాలను ఇప్పటికే పంచాయతీల్లో ప్రకటించామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. కొన్ని పంచాయతీల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉందని, వీలైనంత వరకు వాటి పరిష్కారం చేపట్టి ఎన్నికలు జరిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక రావలసి ఉందని, వచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపడతామన్నారు. ఎన్నికల ఏర్పాట్ల వ్యయానికి సంబంధించీ పునేఠా చర్చించినట్లు సమాచారం.