స్థానిక క్యాడర్ల సర్దుబాటు
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:10 AM
గత ఏడాది డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల మధ్య సిబ్బంది కేటాయింపు ప్రక్రియ కోసం....
4 దశల్లో పూర్తిచేసేలా ప్రణాళిక.. బదిలీలు, పదోన్నతులపై నిషేధం
అమరావతి, జూలై 6(ఆంధ్రజ్యోతి): గత ఏడాది డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం, కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల మధ్య సిబ్బంది కేటాయింపు ప్రక్రియ కోసం ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు వెల్లడింది. 26 జిల్లాల్లో ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికన తాత్కాలికంగా సిబ్బందిని కేటాయించడంతోపాటు, క్యాడర్‌ను ఖరారు చేసే విధివిధానాలను స్పష్టం చేసింది. మొత్తం ప్రక్రియను 4 దశల్లో పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆదేశించారు. కాగా, సచివాలయ విభాగాలు, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలు, సంస్థల్లోని అన్ని రకాల శాశ్వత, తాత్కాలిక, సూపర్ న్యూమరరీ పోస్టులకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. అదేసమయంలో ఆలిండియా సర్వీసు అధికారులు(గ్రూ్‌ప-ఏ, గ్రూప్-బీ), జూడీషియల్ అధికారులు, లెజిస్లేచర్ సెక్రటేరియట్, లోక్‌భవన్ సిబ్బంది, హైకోర్టు, ఇతర దిగువ న్యాయస్థానాల్లోని పోస్టులు, ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రం ఈ మార్గదర్శకాలు వర్తించవు. ఇక, 2025, డిసెంబరు 31 నుంచి పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ రెండు జిల్లాలు ప్రస్తుతం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి రావు. అయినప్పటికీ, వీటిని అధికారికంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి తెచ్చేవరకు ఉద్యోగాల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియను చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తుది కేటాయింపు.. 4 దశలు
మొదటి దశలో.. శాఖాధిపతి 2022 జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో మినహాయించిన కార్యాలయాలు కాకుండా ప్రస్తుతం ఉన్న అన్ని కార్యాలయాల జాబితాను సిద్ధం చేయాలి. కేటాయింపులకు అవకాశం ఉన్న కార్యాలయాలు, లేని కార్యాలయాలు అని రెండు రకాలుగా విభజించాలి. కొత్తగా ఏర్పాటైన స్థానిక ప్రాంతాల్లోని కార్యాలయాల వివరాలను సేకరించి, వాటిని పాత సంబంధిత కార్యాలయాలతో మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చేపట్టాలి.
రెండో దశలో.. ఏ నిష్పత్తిలో పోస్టులు కేటాయించాలో గుర్తించాలి.
మూడో దశలో.. నిర్ణయించిన నిష్పత్తుల ప్రకారం స్థానిక ప్రాంతాలకు కేడర్ స్ర్టెంత్‌ను శాఖాధిపతి కేటాయిస్తారు. అదేవిధంగా వర్కింగ్ సిబ్బందిని విభజించాలి. ఆర్థిక శాఖ దీనిపై ఉత్తర్వులు ఇస్తుంది.
నాలుగో దశలో.. శాఖాధిపతులు తుది కేటాయింపు ప్రతిపాదనను సిద్ధం చేసి సంబంధిత సచివాలయ విభాగానికి సమర్పించాలి. సంబంధిత సెక్రటరీ ఈ ప్రతిపాదనను పరిశీలించి, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ -2025 నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో సరిచూసి ఆర్థిక శాఖకు పంపాలి. ఆర్థిక శాఖ దీన్ని ఆమోదించిన తర్వాత తుది కేటాయింపులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తుంది.
నిషేధం పొడిగింపు
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక కేడర్ల సర్దుబాటు పూర్తికానందున కొత్త పోస్టుల సృష్టి, కొత్త నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, డిప్యుటేషన్లపై ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఈ నెల 13 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో నిషేధం గడువు ఈ నెల 5వ తేదీతో ముగిసింది.