Share News

‘సర్‌’ ముగిసాకే స్థానిక ఎన్నికలు

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:36 AM

రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని..

‘సర్‌’ ముగిసాకే స్థానిక ఎన్నికలు

  • హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదన

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని (ఎస్‌ఈసీ) హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 6వ తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసా గిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ జనగణన చేపట్టడంతోపాటు తదనుగుణంగా రిజర్వేషన్‌ ఖరారు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో పిల్‌ దాఖలు చేశారు. అలాగే రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం త్వరలో ముగియనుందని, వాటి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వాలంటూ న్యాయవాది తాండవ యోగేశ్‌ మరో పిల్‌ వేశారు. వీటిపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సర్‌ ప్రక్రియ ముగిసి ఓటర్ల జాబితా తమకు అందాకే స్థానిక ఎన్నికల ప్రక్రియను చేపట్టగలమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. సామాజిక స్థితిగతులపై జరుపుతున్న సర్వే పూర్తయిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య (రాజీవ్‌ రంజన్‌ మిశ్రా) కమిషన్‌ త్వరలోనే నివేదిక ఇస్తుందని.. ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్‌ ఖరారు చేసి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను వాయిదా వేసింది.

Updated Date - Jul 17 , 2026 | 04:37 AM