Share News

అక్టోబరు చివరికి ‘స్థానిక’ ఎన్నికలు పూర్తి

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:12 AM

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టుకు నివేదించారు.

అక్టోబరు చివరికి ‘స్థానిక’ ఎన్నికలు పూర్తి

  • హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబరు చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ బుధవారం హైకోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితా తయారుచేసి, దానిని ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కోరిందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య (రాజీవ్‌ రంజన్‌ మిశ్రా) కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు. రిజర్వేషన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేయనుందన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పార్టీ ఇన్‌ పర్సన్‌ న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రిజర్వేషన్‌ ఖరారు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ జనగణనతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్‌ ఖరారు చేశాకే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో హైకోర్టులో పిల్‌ వేశారు. రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేషన్‌ మరో పిల్‌ వేశారు. ఈ ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది.

Updated Date - Aug 20 , 2026 | 03:12 AM