బావ కమీషన్లు బావమరిది ఖాతాలో!
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:42 AM
గత ప్రభుత్వంలో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి వ్యవహరించినప్పుడు మద్యం రవాణా టెండర్ల నిబంధనలను అడ్డగోలుగా మార్పు చేశారని సిట్ కోర్టుకు తెలిపింది.
అడ్డగోలుగా మద్యం రవాణా టెండర్ల మార్పు
అనుకూల సంస్థలకు వాసుదేవరెడ్డి కాంట్రాక్టులు
కమీషన్ల డబ్బు బావమరిది ఖాతాల్లో జమ
ప్రభుత్వ ఖజానాకు రూ.192 కోట్ల నష్టం
సిట్ 37 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడి
విజయవాడ, జూలై 20(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి వ్యవహరించినప్పుడు మద్యం రవాణా టెండర్ల నిబంధనలను అడ్డగోలుగా మార్పు చేశారని సిట్ కోర్టుకు తెలిపింది. అనుకూల సంస్థలకు టెండర్లు ఇచ్చి వాటి ద్వారా కమీషన్ల రూపంలో వచ్చే నగదును తన బావమరిదికి చెందిన వ్యాపార సంస్థల ఖాతాలకు మళ్లించినట్టు సిట్ గుర్తించింది. లిక్కర్ రవాణా టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌లో వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్రను సోమవారం సిట్ అధికారులు 37 పేజీల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలను పక్కనబెట్టి టెండర్లను ముందే కుదుర్చుకుని, కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలను మళ్లించారని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. విజయవాడకు చెందిన రేపాకుల సాయి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ప్రాథమిక విచారణ చేపట్టింది. విచారణలో అధిక మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు బయటపడింది. వాసుదేవరెడ్డి బావమరిది మారెళ్ల విజయ నరసింహారెడ్డికి చెందిన శ్రీలక్ష్మీ నరసింహ మిల్క్ కంపెనీ, పెట్రోలు బంక్‌కు చెందిన ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.
జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి
2019 ఎక్సైజ్ విధానం ప్రకారం జిల్లాస్థాయి కమిటీలు నిర్ణయించాల్సిన రవాణా చార్జీలను వాసుదేవరెడ్డి ఏకపక్షంగా రాష్ట్ర స్థాయికి మార్చారు. హమాలీల సమ్మెను కారణంగా చూపించి దీనికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. ఈ నిర్ణయం వల్లే కాంట్రాక్టర్లకు అనుకూలంగా రేట్లు పెరిగి, ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు తేలింది. ముందుగా ఒక్కో కార్టన్ బాక్స్ రవాణాకు కిలోమీటరుకు రూ.19.68 అయ్యేది. కొత్త విధానంలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌కు రూ.32.53, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.35.30 నుంచి రూ.35.90 వరకు చెల్లించారు. ప్రతి కార్టన్‌పై రూ.13 నుంచి రూ.16 వరకు అదనపు చెల్లింపులు జరిగాయి. దీంతో కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు లాభంగా మళ్లించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.192 కోట్ల నష్టం కలిగేలా చేశారు. ఫైనాన్స్ విభాగం, బోర్డు సభ్యులు ఈ పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా వాసుదేవరెడ్డి మౌఖిక ఆదేశాలతో ఫైళ్లను ముందుకు నడిపించారు. టెండర్ నోటిఫికేషన్ విడుదలకు ముందే డ్రాఫ్ట్ పత్రాలు సిద్ధం చేసి కాంట్రాక్టర్లకు తెలియజేశారు. 2020 జూలైలో టెండర్ డ్రాఫ్ట్ సిద్ధమవగా, సెప్టెంబరులో అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు కాంట్రాక్టులు దక్కేలా టెండర్ నిబంధనలను మార్పు చేశారు. పోటీ ఉందని ఇతరులను నమ్మించడానికి బినామీ కంపెనీల పేర్ల మీద టెండర్లు దాఖలు చేశారు. కారుమూరి సునీల్‌కు చెందిన సిగ్మా సంస్థతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. టెండర్ ప్రకటనకు ముందే పంపిన ఈ-మెయిల్ ద్వారా సిగ్మా సంస్థ పేరు మీద టెండర్ వేసి, అసలు కార్యకలాపాలను స్థానిక భాగస్వామి నిర్వహించేలా చేశారు. లాభాల్లో సునీల్ 4 శాతం, వాసుదేవరెడ్డి 96 శాతం పంచుకున్నారు. వసూలు చేసిన కమీషన్లను షెల్ కంపెనీల ద్వా రా మళ్లించారు. నకిలీ బిల్లులు సృష్టించారు. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్, ఈజీలోడ్, కాస్తా పింక్, హైజీన్ ఈకో ఆర్గానిక్స్ వంటి వాటిని నిధుల మళ్లింపునకు ఉపయోగించుకున్నారు.