Share News

నాటి సీఎం అభీష్టం మేరకే

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:41 AM

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ-2గా ఉన్న వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చిందెవరు? ఎక్కడో రైల్వే ట్రాఫిక్‌ సర్వీసులో పనిచేస్తున్న ఆయన్ను ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకురావాలని సిఫారసు చేసిందెవరు?

నాటి సీఎం అభీష్టం మేరకే

  • బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డి

  • రైల్వేస్‌ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీ సర్వీసుకు

  • నాటి సీఎం ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ లేఖలే ఆధారం

  • పక్కా ప్రణాళిక, ముందస్తు కుట్రతోనే: సిట్‌

  • 3,500 కోట్ల లిక్కర్‌ కుంభకోణంలో

  • ప్రధాన కుట్రదారు, పాత్రధారి ఆయనే

  • లిక్కర్‌ సిండికేట్‌ ఏర్పాటులో కీలక పాత్ర

  • యంత్రాంగాన్ని పణంగా పెట్టి ఆదాయానికి గండి

  • సిండికేట్‌కు వేల కోట్ల ముడుపులు

  • ఇండెంట్‌, సరఫరా, అమ్మకాలు అంతా ఆఫ్‌లైన్‌లో

  • వాసుదేవరెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ-2గా ఉన్న వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చిందెవరు? ఎక్కడో రైల్వే ట్రాఫిక్‌ సర్వీసులో పనిచేస్తున్న ఆయన్ను ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకురావాలని సిఫారసు చేసిందెవరు? వాసుదేవరెడ్డిని రాష్ట్ర సర్వీసుకు తీసుకొచ్చాక ఏరికోరి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించాలని చెప్పిందెవరు? ఈ ప్రశ్నలకు వేళ్లన్నీ నాటి ముఖ్యమంత్రి జగన్‌వైపే చూపిస్తున్నాయి. నాటి ముఖ్యమంత్రి కోరిక మేరకే వాసుదేవరెడ్డిని రైల్వే సర్వీసు నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారని సిట్‌ విచారణలో తేలింది. ముఖ్యమంత్రి అభీష్టం మేరకే బేవ రేజెస్‌ కార్పొరేషన్‌కు ఎండీగా, ఆ తర్వాత డిస్టిలరీస్‌ కమిషనర్‌గా నియమించారని, ఇందుకు ఆయన ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ రాసిన లేఖలే ఆధారాలని సిట్‌ తేల్చింది. లిక్కర్‌ స్కామ్‌లో ఏ-2గా ఉన్న వాసుదేవరెడ్డిని శనివారం సిట్‌ అరెస్ట్‌ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన పోస్టుల్లో చేరిన తర్వాత వాసుదేవరెడ్డి.. జగన్‌ సన్నిహితులైన రాజ్‌కసిరెడ్డి, మిఽథున్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇతరులతో కలిసి మద్యం కుంభకోణం చేసేందుకు వ్యూహ రచన చేశారని, ఆ కుట్రకు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించారని ఆయనపై తీవ్ర అభియోగాలు నమోదు చేసింది. వాసుదేవరెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసిన సందర్భంగా కోర్టుకు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది.


అజేయకల్లం సిఫారసు లేఖలు

‘ముఖ్యమంత్రి అభీష్టం మేరకు రైల్వేలో ఉన్న వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకురావాలి’ అని ఒకసారి, ‘ఆయన్ను బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించాలి’ అని మరోసారి ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎ్‌స)కి నోట్స్‌ పంపించారు. సత్యప్రసాద్‌ (ఏ3)ను కూడా సీఎం అభీష్టం మేరకే బేవరే జెస్‌ కార్పొరేషన్‌లో స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించాలని ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ సీఎ్‌సకు నోట్‌ పంపించారు. ఈ విషయాన్ని సిట్‌ పేర్కొంది. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు అన్నాక సీఎస్‌ కేంద్రం, రైల్వే శాఖ పెద్దలను సంప్రదించి వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారు. సీఎం అభీష్టాన్ని బయటపెట్టిన ఆ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ ఎవరంటే.. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అజేయకల్లం రెడ్డి. రిమాండ్‌ రిపోర్టులో నాటి ముఖ్యమంత్రి జగన్‌, ఆయన ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌ అజేయకల్లంరెడ్డి పేర్లు ప్రస్తావించలేదు. కానీ నాటి ముఖ్యమంత్రి అంటే జగనే. ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా పనిచేసింది అజేయకల్లంరెడ్డినే. తొలుత వాసుదేవరెడ్డిని రైల్వేస్‌ నుంచి ఏపీ సర్వీసుకు తీసుకొచ్చాక తాగునీటి సరఫరా కార్పొరేషన్‌ ఎండీగా నియమించాలని నాటి సీఎస్‌ భావించారు. కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకొని బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమిస్తూ 2019 సెప్టెంబరు 16న సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత మరో 15 రోజులకే ఆయన్ను డిస్టిలరీస్‌ కమిషనర్‌గా నియమిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ‘‘ముందస్తు కుట్ర, పక్కా ప్రణాళిక వేసుకున్నాకే వాసుదేవ రెడ్డిని డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చారు. ఆయన్ను విచారిస్తేనే కుట్రలో భాగస్వాములైన వారు, వారి చర్యలను మరింతగా నిగ్గు తేల్చాల్సి ఉంది’’ అని సిట్‌ పేర్కొంది.


బహుముఖ పాత్ర

వాసుదేవరెడ్డి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వచ్చాక లిక్కర్‌ దందాలో ఆయనదే కీలక పాత్ర. లిక్కర్‌ దందా నడిపించేందుకు రాజ్‌కసిరెడ్డి(ఏ1), మిథున్‌రెడ్డి (ఏ4), విజయసాయిరెడ్డి (ఏ5), సజ్జల శ్రీధర్‌రెడ్డి (ఏ6), ముప్పిడి అవినాశ్‌రెడ్డి (ఏ7) తదిత రులతో సమావేశాలు నిర్వహించడం, కుట్రకు వ్యూహరచన చేయడం, ఆ తర్వాత దోపిడీ కుట్రను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారని సిట్‌ పేర్కొంది. వాసుదేవరెడ్డి ఎండీగా వచ్చాక లిక్కర్‌ దందా కుట్రదారులైన రాజ్‌కసిరెడ్డి, మరికొందరి సూచనల మేరకు ఇండెంటింగ్‌ విధానం మార్చారు. ఆన్‌లైన్‌ విధానం తొలగించి దాని స్థానంలో మాన్యువల్‌ విధానం తీసుకొచ్చారు. దీంతో సరఫరాలో పారదర్శకత లోపించింది. దాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర బ్రాండ్లు తెరమీదకు వచ్చాయి. కేవలం నోటి మాటలతోనే వాసుదేవరెడ్డి బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో పాలనా, అమ్మకం, సరఫరా, ఇతర విధానాలను మార్చేశారు. మద్యం సరఫరాలో కీలకమైన సీఏటెల్‌ సాఫ్ట్‌వేర్‌ను తొక్కిపెట్టారు. దీనివల్ల మద్యం మాఫియా సూచించిన బ్రాండ్లనే రిటైల్‌ దుకాణాలకు సరఫరా చేసేలా మాన్యువల్‌ విధానం తీసుకొచ్చారు. రాజ్‌కసిరెడ్డి, ఆయన అనుచరులు సుమిత్‌, ప్రకాశ్‌ల నుంచి వచ్చే ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలని అధికార యంత్రాంగాన్ని శాసించారు. మద్యం అమ్మకాలు, సరఫరా, డిమాండ్‌, చెల్లింపులకు సంబంధించిన డేటాను సిండికేట్‌లకు చేరవేశారు. ప్రముఖ బ్రాండ్లు రిటైల్‌ దుకాణాలకు వె ళ్లకుండా, చిల్లర బ్రాండ్లు దుకాణాలకు చేరడంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్ర. సిండికేట్‌లకు ఏ బ్రాండ్‌ నుంచి ఎంత ముడుపులు చెల్లించాల్నో ఆయనే సమాచారం ఇచ్చేవారు. ఒక్కో బీర్‌ కేసుపై తొలుత 12 శాతం, ఆ తర్వాత 20 శాతం ముడుపులు ముట్టచెప్పాలన్నారు. సిండికేట్‌కు తలొంచకపోతే సరఫరా ఆర్డర్లు నిలిపివేస్తామని బెదిరించారు.


సిండికేట్‌ అడ్డాగా కార్పొరేషన్‌

వాసుదేవరెడ్డి చర్యల వల్ల సిండికేట్‌కు నెలకు కనీసం 50-60 కోట్ల ముడుపులు చేరాయి. వాసుదేవరెడ్డికి తెలిసే 3,500 కోట్ల లిక్కర్‌ దందా జరిగింది. ఇందులో ఎవరెవరి పాత్ర ఏమిటో? ఎవరి వాటాలు ఏమిటో? ఆయనకు తెలుసు. హవాలా మార్గంలో నిధుల మళ్లింపు, వసూళ్లు, ఇంకా అక్రమ సొమ్మును విదేశాలకు తరలించడం, అక్కడ వినియోగించడం వంటి కీలక విషయాలు ఆయనకు తెలిసే జరిగాయి. కానీ ఆ వివరాలపై ఆయన పెదవి విప్పడం లేదు. అంతిమంగా డబ్బు ఎక్కడికి చేరిందన్న విషయాలు వాసుదేవరెడ్డికి బాగా తెలుసు. మద్యం కుంభకోణంలో వెలుగులోకి రాని అనేక కోణాలు వాసుదేవరెడ్డికి తెలుసు. ఈ దందాలో వసూలు చేసిన బ్లాక్‌మనీని వైట్‌మనీగా ఎలా మార్చారు? అక్రమ పద్ధతుల్లో డబ్బును ఎలా దారి మళ్లించారు? సిండికేట్‌ ఆ డబ్బుతో ఏం చేసింది? వంటి విషయాలు ఆయనకు తె లుసు. మద్యం స్కామ్‌లో వచ్చిన డబ్బుతో వాసుదేవరెడ్డి కూడా బాగా అక్రమ సంపాదన పోగేశారు. తన బంధువుల పేరిట భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఈ కేసులో వెలుగుచూడని అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో కనిపెట్టేందుకు మరింత లోతైన విచారణ చేపట్టేందుకు కస్టోడియల్‌ విచారణ అవసరమని సిట్‌ పేర్కొంది. వాసుదేవరెడ్డి బయట ఉంటే అతి కీలకమైన ఆధారాలు చెరిపివేయగలరని కూడా సిట్‌ ఆరోపించింది.


లిక్కర్‌ స్కామ్‌లో ఏ2 వాసుదేవరెడ్డి అరెస్ట్‌

మద్యం కుంభకోణంలో రెండో నిందితుడిగా ఉన్న వాసుదేవరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. సిట్‌ అధికారులు శనివారం అరెస్టు చేసి, ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్స్‌ తరఫున జేడీ రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డి తరఫున హైకోర్టు న్యాయవాది కె.గోపీనాథ్‌ వాదించారు. వాదప్రతివాదనలు విన్న తర్వాత వాసుదేవరెడ్డికి 27 వరకు రిమాండ్‌ విధిస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను గుంటూరులోని జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అండ్‌ కోను అరెస్టు చేయడం మొదలుపెట్టిన తర్వాత తాను అప్రూవర్‌గా మారిపోతానంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కోర్టు అక్షింతలు వేసింది. ప్రభుత్వం మారిన తర్వాత వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న ఆయనను సిట్‌ అధికారులు విచారణ నిమిత్తం పిలిపించారు.

Updated Date - Feb 22 , 2026 | 03:42 AM