Share News

మద్యం స్కామ్‌లో ‘మనీ మేనేజర్‌’

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:32 AM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్‌ కసిరెడ్డి అనుచరుడు తుకేకుల ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి(ఏ-9) ఆర్థిక మూలస్తంభంగా నిలిచారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కోర్టుకు తెలిపింది.

మద్యం స్కామ్‌లో ‘మనీ మేనేజర్‌’

  • 3,500 కోట్ల దందాకు ఆర్థిక మూల స్తంభం

  • షెల్‌ కంపెనీలతో నగదు మళ్లింపు

  • దుబాయ్‌లో నెట్‌వర్క్‌

  • ఎన్నికల్లో డబ్బు రవాణాకు కారులో ప్రత్యేక అర

  • వైసీపీ అభ్యర్థులకు నాడు ఐదు కోట్లు చేరవేత

  • ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లతో రహస్య ఆపరేషన్లు

  • ఈశ్వర్‌ కిరణ్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో ‘సిట్‌’ వెల్లడి

  • గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్‌ కసిరెడ్డి అనుచరుడు తుకేకుల ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి(ఏ-9) ఆర్థిక మూలస్తంభంగా నిలిచారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కోర్టుకు తెలిపింది. లిక్కర్‌ దందాలో సంపాదించిన అక్రమ సొమ్మును షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. విదేశాలకు నిధుల మళ్లింపు వ్యవహారాల ను పర్యవేక్షించడంతో పాటు 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓట్ల కొనుగోలుకు కార్లో ప్రత్యేక అరలు చేయించి రహస్యంగా కోట్లాది రూపాయలు చేరవేసినట్లు వెల్లడించింది. మద్యం ముడుపుల సేకరణకు ఐఐటీ పట్టభద్రులను ఏర్పాటు చేసుకుని, కలెక్షన్‌ ఏజెంట్లుగా వారిని మార్చారని వివరించింది. వీపీఎన్‌, సిగ్నల్‌, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ వంటి ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లను వినియోగించి అత్యంత పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేస్తానంటూ 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌ పాలనలో దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం చోటుచేసుకుంది. జగన్‌ సలహాదారుగా నాడు పనిచేసిన రాజ్‌ కసిరెడ్డి(ఏ1)తో పాటు, వైసీపీ అధినేత కోటరీలోని మిఽథున్‌ రెడ్డి, విజయ సాయిరెడ్డి, ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి వంటి మద్యం ముఠాతో కలిసి శ్రీకాళహస్తికి చెందిన కానిస్టేబుల్‌ కుమారుడు ఈశ్వర్‌ కిరణ్‌ కీలక పాత్ర పోషించారు. ముడుపులు ఇచ్చిన వారికే మద్యం ఆర్డర్లు ఇవ్వడం నుంచి, ముడుపుల వసూళ్లకు పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుని రాజ్‌ కసిరెడ్డితో కలిసి వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ఈశ్వర్‌ కిరణ్‌ కళ్లు, చెవులు అయ్యారు.


రాష్ట్రంలోని లిక్కర్‌ వ్యవస్థను తన చేతుల్లోకి తీసుకున్న రాజ్‌ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఈశ్వర్‌ కిరణ్‌....డికార్డ్‌ లాజిస్టిక్స్‌, యూని కార్పొరేట్‌, ఫ్రెష్‌ చికెన్‌ వంటి వ్యాపారాలను చూపించి, ముడుపుల సొమ్మును దారి మళ్లించారు. అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న కంప్యూటర్‌ ఆధారిత పారదర్శక సరఫరా విధానాన్ని తొలగించి, మాన్యువల్‌ పద్ధతిలో ఆర్డర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్ఎస్)ను అనుకూలంగా మార్చుకుని ఆయన, భారీగా అక్రమ లాభాలు పొందారు. ముడుపులు చెల్లించిన బ్రాండ్లను ప్రోత్సహిస్తూ అప్పటికే మార్కెట్లో డిమాండ్‌ ఉన్న బ్రాండ్లను తొక్కేశారు. ముడుపుల వసూళ్లు, అక్రమ నగదు నిర్వహణలో ఐఐటీ పట్టభద్రును నియమించుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లతో నెట్‌వర్క్‌ను నడిపించారు. ముందు జాగ్రత్తగా చట్ట పరమైన ఇబ్బందులు అంచనా వేసి, 2021లోనే దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌, టెక్నాలజీ రంగాలకు చెందిన వ్యాపారాలు ప్రారంభించారు. ఈ సంస్థల ద్వారానే సిండికేట్‌ సభ్యుల విదేశీ ఖర్చులు, పరారీలో ఉన్న నిందితులకు ఆర్థిక సహాయం అందించినట్లు సిట్‌ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రహస్య అరతో ప్రత్యేక కారు తయారు చేయించుకుని రూ.5కోట్లు తరలించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో 2024 చివర్లో దుబాయ్‌కు పారిపోయి, అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలిపింది. రెండేళ్లుగా విదేశాల్లో ఉన్న ఈశ్వర్‌ను ఆగస్టు 3న హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ అధికారుల సహకారంతో అదుపులోకి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. క్రిమినల్‌ కుట్ర, నమ్మక ద్రోహం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో ఏ-9 నిందితుడిగా ఉన్న ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టింది. అయితే కీలక అంశా లు రాబట్టేందుకు కస్టడీ పిటిషన్‌ వేయబోతున్నారు.


దేశాలన్నీ తిరిగి.. ఆధారాలు ధ్వంసం చేసి..

లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ దర్యాప్తు తీరుతెన్నుల్ని పసిగట్టిన కిరణ్‌ రెడ్డి.. సెల్‌ఫోన్లతోపాటు సోషల్‌ మీడి యా ఖాతాలన్నీ మాయం చేశారు. దుబాయ్‌లో కుటుంబాన్ని పెట్టి థాయ్‌లాండ్‌, శ్రీలంక, అమెరికా, ఆఫ్రికా దేశాల్లో రెండేళ్ల పాటు పర్యటించారు. ఒక కానిస్టేబుల్‌ కుమారుడికి ఇంత డబ్బు ఎక్కడిది.. ఇన్ని రోజులు వినియోగించిన ఫోన్లు ఎందుకు అక్క డే పడేసి వచ్చావు.. అని సిట్‌ అధికారులు ప్రశ్నించగా, ఈశ్వర్‌ మౌనం వహించినట్లు తెలిసింది.

రిమాండ్‌కు ఈశ్వర్‌ కిరణ్‌ తరలింపు..

విజయవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఈశ్వర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్‌ విధించింది. ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

Updated Date - Aug 05 , 2026 | 03:34 AM