గొడ్డలి పార్టీ హయాంలోనూ ‘పీ4’
ABN , Publish Date - May 30 , 2026 | 05:27 AM
గొడ్డలి పార్టీ హయాంలో జరిగిన భారీ అక్రమాల్లో కీలకమైనది లిక్కర్ కుంభకోణమని, దానికి సంబంధించి రోజుకో విస్తుపోయే వాస్తవం వెలుగు చూస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు.
అది పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్‌షిప్..
ఆ ‘పీ4’కు కేఎన్‌ఆర్ అక్రమ ఆస్తులే నిదర్శనం
ఆ లావాదేవీలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
కేఎన్‌ఆర్ ఖాతాల్లోకి చేరిన సొమ్ములు జగన్‌వే
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి
అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ హయాంలో జరిగిన భారీ అక్రమాల్లో కీలకమైనది లిక్కర్ కుంభకోణమని, దానికి సంబంధించి రోజుకో విస్తుపోయే వాస్తవం వెలుగు చూస్తోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఆంతరంగిక బృందంలోని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, రాజ్ కెసిరెడ్డి వంటి వారి పాత్ర ఇప్పటికే వెలుగులోకి రాగా తాజాగా జగన్ షాడో కేఎన్‌ఆర్ (కె.నాగేశ్వర్ రెడ్డి) పాత్ర వెలుగులోకి వచ్చిందన్నారు. రూ.3500 కోట్ల లిక్కర్ కుంభకోణంలో ఆ సొమ్ము అంతా రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఎలా మళ్లిందో ఆధారాలతోసహా బయటపడ్డాయన్నారు. జగన్ ఆత్మ అయిన కేఎన్‌ఆర్ ఆస్తుల చిట్టా, ఆయన భార్య బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మడం ఖాయమన్నారు. పేదరికం లేని సమాజం కోసం చంద్రబాబు పీ4 తీసుకొచ్చారని, చంద్రబాబు పీ4 అంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టనర్‌షిప్ అని వివరించారు. అయితే, గొడ్డలి పార్టీ కూడా పీ4 పథకాన్ని అమలు చేసిందని, అదే పవర్, ప్రాపర్టీ, పైసా పార్టనర్‌షిప్ అని ఎద్దేవా చేశారు. జగన్ కు కేఎన్‌ఆర్ బినామీ అని, కేఎన్‌ఆర్ ఖాతాలోకి వెళ్లిన సొమ్ము వెనుక అసలు సూత్రధారి గొడ్డలిపార్టీ అధ్యక్షుడు జగనే అని విమర్శించారు.