దుబాయ్‌లో డీల్స్..ఆఫ్రికాలో పెట్టుబడులు
ABN , Publish Date - May 30 , 2026 | 04:58 AM
చార్టర్ ఫ్లైట్‌లో చక్కర్లు.. విదేశాల్లో విలాసాలు.. ఖరీదైన హోటళ్లలో బస.. మందు పార్టీలు.. అమ్మాయిలతో చిందులు..
దేశం దాటిన లిక్కర్ స్కామ్ సొమ్ము
గ్యాంగ్‌లో ప్రణయ్ ప్రకాశ్ గుట్టు బయటికి
డిస్టిలరీస్ నుంచి వసూళ్లు.. గుట్టలుగా నిల్వలు
తాడేపల్లిలోనూ డెన్.. వైసీపీ అభ్యర్థులకు పంపిణీ
చెవిరెడ్డితో విదేశీ ట్రిప్పులు.. కసిరెడ్డితో కలిసి విలాసాలు
చార్టర్ ఫ్లైట్‌లో ప్రయాణం.. ఖరీదైన హోటళ్లలో బస
డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా వివరాలు వెలికితీత
ఆధారాలు, ఫొటోలతో సహా కోర్టులో సిట్ చార్జిషీట్
అమరావతి, విజయవాడ, మే 29 (ఆంధ్రజ్యోతి): చార్టర్ ఫ్లైట్‌లో చక్కర్లు.. విదేశాల్లో విలాసాలు.. ఖరీదైన హోటళ్లలో బస.. మందు పార్టీలు.. అమ్మాయిలతో చిందులు.. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ నిందితుల జల్సాలు అన్నీ ఇన్నీ కావు. మద్యం ముఠా వసూలు చేసిన సొమ్మును దేశం దాటించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తేల్చింది. ఏపీలో లిక్కర్ డిస్టిలరీస్ నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేయడం.. దుబాయ్‌లో రహస్య ప్రదేశంలో సమావేశాలు ఏర్పాటు చేయడం.. ఆఫ్రికాలో మైనింగ్‌లో పెట్టుబడులు పెట్టడంపై చర్చలు జరపడం.. అన్నింటినీ సిట్ ఆధారాలతో సహా వెలికితీసింది. ఆర్థిక నేరాలకు సంబంధించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లా ఉన్న మద్యం మాఫియా గుట్టు డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా కళ్లకు కట్టినట్లు సిట్ కోర్టు ముందు పెట్టింది. వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు లిక్కర్ సొమ్ము ఎలా వినియోగించారో తేల్చింది. మద్యం కుంభకోణంలో ఏ-1 రాజ్ కసిరెడ్డి వసూళ్ల గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రణయ్ ప్రకాశ్‌ను సిట్ అరెస్టు చేసి జైలుకు పంపింది. అతడి పాత్రపై శుక్రవారం విజయవాడ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపిన వివరాల మేరకు.. గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ సిండికేట్ మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన కమీషన్లు నిల్వ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ ప్రకాశ్ ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్లు అద్దెకు తీసుకున్నాడు.

హైదరాబాద్‌లోని ఖాజాగూడ సర్కిల్‌లో ఉన్న ఉమా హిల్‌క్రెస్ట్ అపార్టుమెంటును క్యాష్ కలెక్షన్ పాయింట్‌గా వాడుకున్నారు. ప్రణయ్ ఫోన్‌లో లభ్యమైన 2021 నాటి ఫొటోల్లో లిక్కర్ డిస్టిలరీల పేర్లతో ఉన్న అట్టపెట్టెల్లో గుట్టలుగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు సరితూగాయి. నగదు రవాణా సమయంలో బూనేటి చాణక్య, రాజ్ కసిరెడ్డికి ప్రకాశ్ ఫోన్లలో వివరాలు తెలియజేసేవాడు. సిట్ అధికారులు ప్రకాశ్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుని డిజిటల్ ఫోరెన్సిక్ నిర్వహించగా.. అందులో నోట్ల పెట్టెలు, మూటలు నిల్వచేసిన ఫొటోలు మొదలుకొని ఎవరెవరు ఎంత ఇచ్చారనే వివరాలు బయట పడ్డాయి. తాడేపల్లిలో డెన్ ఏర్పాటు చేసుకుని వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో చెవిరెడ్డి మనుషుల ద్వారా నగదు పంపణీ చేయడం, విదేశాలకు నిధులు మళ్లించడం, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ప్రకాశ్ విదేశీ ప్రయాణాలు చేయడం.. ఇలా పలు సంచలన విషయాలను సిట్ చార్జిషీట్‌లో పేర్కొంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టుకు అందజేసింది. మద్యం ముడుపులు నగదు రూపంలో సేకరించేందుకు వేసిన ఎత్తుగడ, సొమ్ములు దాచేందుకు అవలంబించిన విధానం, ఇతర నిందితులతో సంబంధాలు, చట్టం నుంచి తప్పించుకునేందుకు పన్నిన వ్యూహాలపై జరిగిన చర్చలు, వైసీపీ నేతల భాగస్వామ్య హామీలు, ఫోన్లు ధ్వంసం చేయాలన్న సూచనలు, అక్రమ నిధులు చట్టబద్ధం చేసే ప్రయత్నాల గురించి వివరించింది. డెన్‌లో భారీగా నోట్ల కట్టలు దాచి ఉంచిన ఫొటోలు కోర్టుకు సమర్పించింది.
విందులు.. విలాసాలు
ఒకే చార్టర్ ఫ్లైట్‌లో కసిరెడ్డి, ప్రణయ్ ప్రకాశ్ కలిసి ప్రయాణించిన ఫొటోలు, టాంజానియా విమానాశ్రయంలో చెవిరెడ్డి, ప్రకాశ్ కలిసి ఉన్న ఫొటోలను సిట్ కోర్టుకు సమర్పించింది. కసిరెడ్డితో కలిసి ప్రకాశ్ విలాసాలు చేయడం.. ఖరీదైన హోటళ్లలో బస చేసేందుకు విచ్చలవిడిగా ఖర్చు చేయడం.. యువతులతో చిందులు వేయడం, మద్యం సేవించడం.. అన్నింటినీ డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వెలికి తీసి సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. మద్యం సిండికేట్ అక్రమ నిధులతో ప్రణయ్ ప్రకాశ్ జాంబియా, జింబాబ్వే, టాంజానియా వంటి దేశాలకు పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లినట్లు వివరించారు. దర్యాప్తు బృందం తేల్చిన మేరకు.. ప్రణయ్ ప్రకాశ్ మొదట్లో క్యాష్ హ్యాండ్లింగ్ మేనేజర్‌గా రాజ్ కసిరెడ్డి వద్దకు చేరి నగదు నిర్వహణతో మాఫియా జీవితాన్ని ప్రారంభించాడు. విశ్వసనీయ సహచరుడిగా ఎదిగి చివరికి ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టే ప్రణాళికలో భాగస్వామిగాఎదిగాడు.
మద్యం డబ్బులతో మైనింగ్
మద్యం కంపెనీల కమీషన్లు తీసుకున్న ఈ గ్యాం గ్ రెండు ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ కార్యకలాపాల్లో పెట్టుబడులు పెట్టింది. ఈ విషయాన్ని ప్రణయ్ ప్రకాశ్ ఫోన్లలో ఉన్న డేటా తెలియజేసింది. టాంజానియా, జింబాబ్వేలో మైనింగ్ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు ఆధారాలు దొరికాయి. బూనేటి చాణక్య సూచనలతో ప్రణయ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఆఫ్రికా దేశాల్లో పర్యటించినట్టు ఫోన్లలోని జీపీఎస్ లోకేషన్ల ద్వారా రుజువైంది.
‘ఐదు శాతం ఇవ్వకపోతే గుట్టు విప్పేస్తా’
మద్యం డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్న గ్యాంగ్‌లో వాటాలు వివాదాలను పుట్టించాయి. ఈ విషయం ప్రణయ్ ప్రకాశ్ ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో విశ్లేషించడంతో తేలింది. ప్రణయ్‌కు భాని అనే వ్యక్తితో వాట్సాప్‌లో వార్ నడిచింది. ‘‘నాకు రావాల్సిన ఐదు శాతం వాటాను ఇవ్వలేదు. అక్రమంగా సంపాదించిన డబ్బును అంతా కలిసి పంచుకుని అనుభవిస్తున్నారు. సిట్ అధికారులు నన్ను విచారణలో విల్లా, థియేటర్ వద్ద ఇచ్చిన డబ్బుల గురించి అడుగుతున్నారు. అన్నీ ఒప్పుకొంటే నువ్వు, అనురాగ్ జైలుకు వెళ్లడం ఖాయం. నాకు, నా భార్యకు ఏమైనా జరిగితే మొత్తం స్కాం బయటపెడతాను. తర్వాత విజిల్ బ్లోయర్‌ను నేనే అవుతా’’ నంటూ వాట్సా్‌పలో ఈ ఏడాది జనవరి 26న సందేశం పంపాడు.