ముడుపుల కోసమే..!
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:14 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్‌లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది.
కొన్ని డిస్టిలరీలకే ఎక్కువ ఆర్డర్లు
పాపులర్ బ్రాండ్లను తప్పించారు.. అనామక బ్రాండ్లను తెప్పించారు
ఇదంతా చేసిందెవరో మీకూ తెలుసు
‘సిట్’ ఇప్పటికే అన్నీ తేల్చింది కదా!
ఈడీ ముందు గుట్టువిప్పిన సాయిరెడ్డి!?
హవాలాపై పలు ఆధారాల సమర్పణ
లిక్కర్ స్కామ్‌లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ
కీలక అంశాలపై వరుస ప్రశ్నలు
విజిల్ బ్లోయర్‌గా తెలిసినదంతా చెబుతానని వెల్లడి
అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్‌లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమీషన్ల వసూలు వరకూ ముఖ్యపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్‌లో ఏడు గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో మూడుసార్లు భేటీలు జరిగాయని ఆయన చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ‘‘ఎక్సైజ్ మంత్రి, అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వారు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంటు సభ్యుడైన మీరు ఎందుకు కల్పించుకున్నారు? పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏంటి?’’ అని సాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ప్రైవేటు మద్యం దుకాణాలు తీసేసి, ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు, ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ‘‘ఆ విధానాన్ని సూచించింది ఎవరు?’’ అని సాయిరెడ్డిని ప్రశ్నించగా... అప్పటి ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లు సమాచారం. అప్పట్లో నిర్దిష్టంగా కొన్ని డిస్టిలరీల నుంచే 75 శాతం మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణమేమిటని ప్రశ్నించగా... ‘కమీషన్ల కోసమే’ అని సాయిరెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. మార్కెట్లో వినియోగంలో ఉన్న ప్రసిద్ధ బ్రాండ్లను పథకం ప్రకారం తప్పించడం వెనుక ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించినప్పుడు.. ‘‘మీకు అన్నీ తెలుసు.
ఇప్పటికే సిట్ ద్వారా అన్నీ తెలుసుకున్నారు కదా! ఇక నేను చెప్పేది ఏముంటుంది!’’ అని సాయిరెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. ‘దీని వెనుక ఎవరున్నారు? అప్పటి ప్రభుత్వంలో ముఖ్యులా లేక అధికారులా?’ అని ప్రశ్నించగా... ‘అందరూ ఉన్నారు’ అంటూ సాయిరెడ్డి కొందరి పేర్లు వెల్లడించినట్లు తెలిసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రకరకాల పేర్లతో స్థానిక బ్రాండ్లను ప్రవేశపెట్టడం వెనుక ఎవరి పాత్ర ఉందనే ప్రశ్నకు సాయిరెడ్డి సూటిగా చెప్పలేదు. ‘‘ఇబ్రహీంపట్నం నుంచి తంబళ్లపల్లె వరకూ తీగ బయటికి వచ్చింది. అదంతా పత్రికల్లో చూశా. నాకు ఆ విషయాల గురించి తెలియదు’’ అని చెప్పినట్లు సమాచారం.
డబ్బులెలా పోయాయంటే...
మద్యం ముడుపుల వసూలు, వాటిని ఎక్కడెక్కడికి, ఎలా చేరవేశారనే అంశంపై సాయిరెడ్డిని ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఆ వివరాలను ఆయన కొంత వివరంగానే వెల్లడించినట్లు సమాచారం. ‘‘హైదరాబాద్‌కన్నా ముంబై నుంచే డబ్బు బయటికి ఎక్కువగా వెళ్లింది. అందులో నాకు కొన్నే తెలుసు’’ అంటూ కొన్ని ఆధారాలను కూడా ఈడీకి అందించినట్లు తెలిసింది. ఎంత మొత్తం ఎటు వెళ్లింది, తరలించిన వ్యక్తులెవరు, హవాలా చేసిందెవరు.. తదితర వివరాలు అందులో ఉన్నట్లు సమాచారం. ఆ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు అప్పటికిప్పుడే స్కాన్ చేసి ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపగా... వాటన్నింటినీ పరిశీలించి, అవి కీలకమైన ఆధారాలుగా గుర్తించినట్లు సమాచారం. వందల కోట్ల మనీ రూటింగ్‌తోపాటు సూట్ కేసు కంపెనీల వివరాలు కూడా సాయిరెడ్డి అందజేసినట్లు తెలిసింది. మద్యం స్కామ్‌లో ఏ1 రాజ్ కసిరెడ్డితో లావాదేవీలు జరిపిన ముంబై హవాలా వ్యాపారులతోపాటు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రపైనా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. తనకు తానే విజిల్ బ్లోయర్‌గా మారానని, ఏదీ దాచకుండా తెలిసిన విషయాలన్నీ చెబుతానని సాయిరెడ్డి అనడంతో... అవసరమైతే మళ్లీ పిలుస్తామంటూ ఈడీ అధికారులు ఆయనను పంపించారు. లిక్కర్ స్కామ్‌లో ఏ-1 రాజ్ కసిరెడ్డిని విజయవాడ జైలులో ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత... ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం వద్ద ఉన్న శర్వాణీ డిస్టిలరీస్ చంద్రారెడ్డి, మహేశ్వర సింగ్‌లను విచారించారు. శుక్రవారం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని హైదరాబాద్‌లో ప్రశ్నించనున్నారు.