వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN , Publish Date - May 01 , 2026 | 03:42 AM
మద్యం కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డికి విజయవాడ ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఝలక్ ఇచ్చింది.
విజయవాడ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ఏ2గా ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డికి విజయవాడ ఏడో అదనపు జిల్లా జడ్జి కోర్టు ఝలక్ ఇచ్చింది. సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయాధికారి అబ్రహం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. వైసీపీ ప్రభుత్వంలో వాసుదేవరెడ్డి బేవరేజస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయనకు కొద్దిరోజుల క్రితమే బెయిల్ మంజూరవడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. మద్యం రవాణాలో జరిగిన అవకతవకలపై తాజాగా సీఐడీ ఇప్పుడు కేసు నమోదు చేసింది. ఈ కేసులోనూ అరెస్టు చేస్తారని భావించి ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదప్రతివాదనలు ముగియడంతో కోర్టు తీర్పును వెలువరించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.