Share News

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

ABN , Publish Date - Apr 18 , 2026 | 03:46 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ...

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

  • లిక్కర్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన కసిరెడ్డి

  • వివరాలు సమర్పించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం

అమరావతి, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలతో సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది అభయ్‌సిద్ధాంత్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్‌ గత 16 నెలలుగా జైల్లో ఉన్నారన్నారు. ఇటీవలే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. లిక్కర్‌ రవాణాలో అక్రమాలు జరిగాయని నమోదైన కేసులో విచారణకు రావాలని పిటిషనర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. మరోసారి అరెస్ట్‌ చేస్తారనే ఆందోళన ఉందని, అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని గుర్తు చేశారు. వివరాలు సమర్పించాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Updated Date - Apr 18 , 2026 | 03:46 AM