AP Link Project: త్వరలో ‘ఏపీ లింక్’ ప్రాజెక్ట్!
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:01 AM
రాష్ట్రంలో త్వరలోనే ‘ఏపీ లింక్’ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
హైవేలు, రైల్వే, ఓడరేవులను అనుసంధానించే భారీ కారిడార్: సీఎం
ఏపీకి అన్ని విధాలా సహకారం
కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకారం
బెంగళూరు-కడప-విజయవాడ
ఎక్స్‌ప్రె్‌సవేకు గిన్నిస్ రికార్డులు
సత్యసాయి జిల్లాలో అందజేత
వర్చువల్‌గా పాల్గొన్న సీఎం, గడ్కరీ
4 రికార్డులు గర్వకారణం: బాబు
అమరావతి-బెంగళూరు కారిడార్‌గా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వినతి
వెంటనే అంగీకరించిన కేంద్ర మంత్రి
అమరావతి/పుట్టపర్తి రూరల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలోనే ‘ఏపీ లింక్’ అనే ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇది జాతీయ రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, రాష్ట్ర రహదారులు, విమానాశ్రయాలను అనుసంధానించే గొప్ప లాజిస్టిక్ కారిడార్ అని పేర్కొన్నారు. బెంగళూరు-కడప-విజయవాడ(బీకేవీ) ఎకనామిక్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణానికి 4 గిన్నిస్ రికార్డులు లభించాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం సాతార్లపల్లి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కారిడార్ నిర్మాణ సంస్థ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సీఎండీ జగదీశ్ కదంకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత ప్రవీణ్ పటేల్ చేతుల మీదుగా గిన్నిస్ రికార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలు వర్చువల్‌గా పాల్గొన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ముంబైలోని పుణేకు చెందిన రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థ బిటుమినస్ కాంక్రీటుతో 6 లైన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి, గిన్నిస్ రికార్డును సాధించింది. 10,655 మెట్రిక్ టన్నుల కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది.
ఈ నెల 6-11 తేదీల మధ్య ఏకబిగిన 52 కిమీ మేర ఆరు లైన్ల రోడ్డు నిర్మించారు. 6వ తేదీన 24 గంటల్లోనే 28.8 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారుల సంస్థ నిర్మించింది. 10 వేల కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రె్‌సవేలు చేపడుతున్నారు. అమరావతి నుంచి బెంగుళూరుకు నేరుగా రోడ్డు వేయాలని నిర్ణయించాం. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్‌కు ‘అమరావతి-బెంగుళూరు కారిడార్’గా పేరు పెట్టాలని కోరుతున్నా.’’ అని అన్నారు. కాగా, గతంలో రహదారి నిర్మాణంలో ఒక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఒక గిన్నిస్ రికార్డును సైతం రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే సంస్థ 4 గిన్నిస్ రికార్డులను సాఽధించి, తమ రికార్డులను తామే అధిగమించింది.
నాణ్యతలో రాజీ లేదు: గడ్కరీ
భగవాన్ శ్రీసత్యసాయి ఆశీర్వాదంతో బెంగుళూరు-కడప-విజయవాడ కారిడార్ నిర్మాణంలో ప్రపంచ రికార్డులను సాధించగలిగామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘‘వరి గడ్డి ద్వారా బిటుమినస్ తయారీకి సంబంధించి కొత్త ఆవిష్కరణ జరిగింది. దానిని ఉపయోగించడంలో ఏపీ కూడా భాగస్వామి కావాలి. రాష్ట్రంలో వరిని ఎక్కువగా పండిస్తున్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేథోపరమైన ఆలోచనలు నాణ్యతను పెంచి, వ్యయాన్ని తగ్గించాలి. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ, కాలుష్య రహిత విధానాలు అవలంభించాలి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో పనులు వేగంగా చేపట్టేందుకు ఆస్కారం కలిగింది. జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతోంది. రవాణా వ్యయం 9శాతం కంటే తక్కువకు పరిమితమయ్యేలా పని చేయాల్సి ఉంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గడం ద్వారా మెరుగైన ఫలితాలు, వృద్ధిని సాధించేందుకు వీలవుతుంది. బెంగుళూరు-కడప-విజయవాడ మార్గంలో ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. సీఎం చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు మేం సర్వదా సిద్ధం. చంద్రబాబు తన జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితం చేస్తున్నారు.’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ న్యాయ నిర్ణేత ప్రవీణ్ పటేల్, ఫెసిలిటేటర్ మిలింద్ వర్లేకర్(లండన్), రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారఽథి పాల్గొన్నారు.
‘బిటుమినస్’ కొత్త ఆవిష్కరణ
4 గిన్నిస్ రికార్డులను సాధించే అవకాశం కల్పించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్‌హెచ్‌ఏఐకి ధన్యవాదాలు తెలుపుతున్నామని రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సీఎండీ జగదీశ్ కదం అన్నారు. వరిగడ్డి ద్వారా బిటుమినస్ తయారీ ఒక కొత్త ఆవిష్కరణ అని తెలిపారు. దానిని ఉపయోగించడంలో ఏపీ కూడా భాగస్వామి కావాలని కోరారు.
ఇవీ రికార్డులు
24 గంటల్లో 28.89 కి.మీ. మేర నిరంతరాయంగా 6 లేన్ బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం.
24 గంటల్లో అత్యధికంగా 10,657 టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్ వినియోగించడం.
57.500 మెట్రిక్ టన్నుల బిట్యుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేయడం.
156(సింగిల్ లేన్) కి.మీ. మేర నిరంతరాయంగా రహదారి నిర్మాణం.