Share News

వరుసగా రెండో ట్రూడౌన్‌!

ABN , Publish Date - Jul 15 , 2026 | 03:59 AM

రాష్ట్ర ప్రజలకు మరో ఊరట లభించనుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వరుసగా రెండోసారి ట్రూడౌన్‌ అమలు దిశగా అంటే చార్జీల భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

వరుసగా రెండో ట్రూడౌన్‌!

  • కరెంటు యూనిట్‌పై మరో 13 పైసలు తగ్గింపు!

  • ఏపీఈఆర్‌సీ ఆమోదం రాగానే అమలు

  • 2025-26 ఇంధన సర్దుబాటు ఖర్చుల్లో రూ.940 కోట్లు మిగులు చూపిన డిస్కంలు

  • నియంత్రణ మండలికి వివరాల సమర్పణ

  • గత ఏడాది తొలిసారి ట్రూడౌన్‌ అమలు

  • నిరుడు సెప్టెంబర్లో రూ.923 కోట్లు మిగులు

  • అప్పుడూ యూనిట్‌కు 13 పైసల తగ్గింపు

  • ఉమ్మడి, విభజిత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానిదే ఈ ఘనత

అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు మరో ఊరట లభించనుంది. విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వరుసగా రెండోసారి ట్రూడౌన్‌ అమలు దిశగా అంటే చార్జీల భారం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. యూనిట్‌కు మరో 13 పైసల భారం తగ్గించనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి సమర్పించిన ఇంధన సర్దుబాటు ఖర్చు(ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జె్‌స్టమెంట్‌ -ఎఫ్‌పీపీసీఏ)ల్లో రూ.940.07 కోట్లను మిగులుగా చూపాయి. ట్రూడౌన్‌ సహా అవి ఇచ్చిన వివరాలను ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఏపీఈఆర్‌సీ ఆమోదించనుంది. ఆ తర్వాత.. 940 కోట్లను ట్రూడౌన్‌ చేసి యూనిట్‌పై 13 పైసల వరకు భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాష్ట్ర చరిత్రలో వరుసగా రెండోసారి విద్యుత్‌ చార్జీలను ట్రూ డౌన్‌ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, విభజిత రాష్ట్రంలో గానీ విద్యుత్‌ రంగ చరిత్రలో తొలిసారి ట్రూడౌన్‌ చేసిన ఘనత కూటమికే దక్కింది. గత ఏడాది సెప్టెంబర్లో రూ.923.55 కోట్లను మిగులుగా చూపి.. ట్రూడౌన్‌ చేశారు. ఆ మొత్తాన్ని 2025 నవంబరు నుంచి 2026 అక్టోబరు వరకు వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తున్న సంగతి తెలిసిందే.


మిగులంతా ఈపీడీసీఎల్‌దే..!

మూడు డిస్కంలు సమర్పించిన ఇంధన సర్దుబాటు చార్జీల్లో సీపీడీసీఎల్‌ రూ.21.91 కోట్లు అధికంగా ఖర్చయినట్లు చూపగా.. ఎస్పీడీసీఎల్‌ అత్యధికంగా రూ.518.86 కోట్ల వ్యయం చూపింది. కానీ ఈపీడీసీఎల్‌ రూ.1495.37 కోట్లు మిగులు చూపి రికార్డు సృష్టించింది. మిగతా రెండు డిస్కంలు చూపిన నష్టాలను భర్తీ చేయడమే కాకుండా అదనంగా రూ.940.07 కోట్లు మిగులుగా చూపింది. ఎస్పీడీసీఎల్‌ పరిధిలో నిర్వహణ లోపాల వల్ల ఎక్కువ ఖర్చు కాగా.. ఈపీడీసీఎల్‌ దీనిని గణనీయంగా కట్టడి చేసి రికార్డు స్థాయిలో రూ.1495.37 కోట్లు మిగులు చూపింది.

Updated Date - Jul 15 , 2026 | 04:01 AM