Share News

తూనికలు, కొలతల లైసెన్స్‌ రూల్స్‌కు సవరణలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:33 AM

తూనికలు, కొలతల విభాగంలో తయారీదారులు, డీలర్లకు, మరమ్మతులు చేసేవారికి లైసెన్సుల జారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ మెట్రాలజీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) రూల్స్‌-2011కు సవరణలు చేస్తూ..

తూనికలు, కొలతల లైసెన్స్‌ రూల్స్‌కు సవరణలు

అమరావతి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): తూనికలు, కొలతల విభాగంలో తయారీదారులు, డీలర్లకు, మరమ్మతులు చేసేవారికి లైసెన్సుల జారీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ మెట్రాలజీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) రూల్స్‌-2011కు సవరణలు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్రం సూచించిన సంస్కరణలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వ ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్’లో భాగంగా రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రూల్స్‌లో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ గత నెల 13న ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఎలాంటి అభ్యంతరాలూ రాకపోవడంతో ప్రభుత్వం ప్రతిఏటా డీలర్లు, తయారీదారులకు ఇచ్చే లైసెన్స్‌ల జారీకి ఆటో అప్రూవల్‌ విధానాన్ని తీసుకువచ్చింది. లైసెన్సుల కోసం తయారీదారులు, డీలర్లు నిర్దేశిత ఫీజు చెల్లించి, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసుకుని, సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇస్తే అప్పటికప్పుడే లైసెన్స్‌ జారీ అవుతుంది. తయారీదారులకు రూ.10వేలు, మరమ్మతులు చేసేవారికి రూ.5వేలు, డీలర్లకు రూ.2వేల ఫీజు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫిషియో కార్యదర్శి కె.కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 24 , 2026 | 04:35 AM