Share News

అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీదే ప్రథమ స్థానం

ABN , Publish Date - May 24 , 2026 | 05:51 AM

భారత అటవీ సర్వే గణాంకాల ప్రకారం అటవీ విస్తీర్ణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) పీవీ చలపతిరావు అన్నారు.

అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీదే ప్రథమ స్థానం

  • విత్తనాలు జల్లేందుకు తొలిసారిగా డ్రోన్ల వినియోగం

  • రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల తాటి టెంకలు నాటుతాం

  • కేంద్రం నిధులు రాగానే దివాన్‌ చెరువు వద్ద జూ నిర్మాణం

  • రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి చలపతిరావు

దివాన్‌చెరువు, మే 23(ఆంధ్రజ్యోతి): భారత అటవీ సర్వే గణాంకాల ప్రకారం అటవీ విస్తీర్ణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) పీవీ చలపతిరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ గణాంకాలు వస్తాయి. దీని ప్రకారం రాష్ట్రంలో 30 శాతం భూభాగం పచ్చదనంతో ఉంది. ఇందులో 23 శాతం అనగా 37 లక్షల హెక్టార్లు అడవులు కాగా మరో 7 శాతం చెట్ల రూపంలో ఉంది. దీనిని 2030 సంవత్సరం నాటికి 37 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నాం. అలాగే 2047 సంవత్సరం నాటికి 50 శాతం అనగా 86 లక్షల హెక్టార్లకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాం. పచ్చదనం పెంపులో భాగంగా రాయలసీమ వంటి ప్రాంతాల్లో సైతం ఉద్యాన తోటల పెంపకంపై దృష్టి సారించాం. అలాగే కల్పవృక్షంగా భావించే తాటిచెట్లు తుఫాన్లను తట్టుకుంటాయి. అందుకే రాష్ట్రంలో 50 లక్షల తాటి టెంకలు నాటాలని యోచిస్తున్నాం. ప్రభుత్వ స్థలాల్లో వీటిని నాటుతాం.


అలాగే పనస, వేప, అడవి మామిడి, మర్రి, చింత వంటి వాటికి కూడా ప్రాధాన్యమిస్తున్నాం. జూన్‌ నాటికి జిల్లాలో 2.5 కోట్ల విత్తన బంతులను సిద్ధం చేసి జూలై మొదటి వారంలో వాటిని నాటుతాం. విత్తనాలను వెదజల్లేందుకు రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్లను ఉపయోగిస్తున్నాం. రాజానగరం మండలం దివాన్‌చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో జూ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర అటవీ అకాడమీ సొంత భవనం నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. టెండర్లు పూర్తయ్యాయి. గైట్‌ కళాశాల వద్ద రూపుదిద్దుకుంటున్న నగర వనంలో అటవీ పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దుతాం. ఔషధ మొక్కలతో సహా వివిధ రకాల వృక్ష జాతులను అభివృద్ధి చేస్తాం’ అని చలపతిరావు తెలిపారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్‌ బి.విజయకుమార్‌, రాజమహేంద్రవరం అటవీ సర్కిల్‌ సీసీఎఫ్‌ టి.జ్యోతి, జిల్లా అటవీ అధికారి వి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 05:52 AM