Share News

BJP President Madhav: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రం పరుగులు

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:09 AM

రాష్ట్రంలోనూ దేశంలోనూ గ్రీన్‌ ఎనర్జీ సునామీలా వెల్లువెత్తాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆకాంక్షించారు. కాకినాడలో ఏఎం గ్రీన్‌ అమ్మోనియం కంపెనీ శంకుస్థాపన సభలో ఆయన....

BJP President Madhav: గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రాష్ట్రం పరుగులు

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

కాకినాడ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనూ దేశంలోనూ గ్రీన్‌ ఎనర్జీ సునామీలా వెల్లువెత్తాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ ఆకాంక్షించారు. కాకినాడలో ఏఎం గ్రీన్‌ అమ్మోనియం కంపెనీ శంకుస్థాపన సభలో ఆయన ప్రసంగిస్తూ ఇక, రాష్ట్రం గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పరుగులు తీస్తుందన్నారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖ వచ్చినప్పుడు అతిపెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ను ప్రారంభించారని, ఇప్పుడు కాకినాడలో ఏఎం గ్రీన్‌ రావడం హర్షణీయమని పేర్కొన్నారు. సన్‌రైజ్‌ ఏపీలో ఏఎం గ్రీన్‌ కొత్త కాంతులు ప్రసరింపజేయనుంది. నాలుగు రోజులు రాష్ట్రంలో సంక్రాంతి జరిగింది. పండగంటే రాక్షసత్వంపై దైవత్వం విజయం. కర్బన్‌ ఉద్గారాల రక్కసిని తరిమికొట్టేందుకు గ్రీన్‌ ఎనర్జీ అనే దైవశక్తికి ఏంఎం గ్రీన్‌ నాంది పలుకుతోంది’ అని మాధవ్‌ వ్యాఖ్యానించారు.

కర్బన ఉద్గారాలు తగ్గుతాయి: గ్రీన్‌కో వ్యవస్థాపకులు

ఏఎం గ్రీన్‌ వ్యవస్థాపకులు చెలమలశెట్టి అనిల్‌, కొల్లి మహేశ్‌ మాట్లాడుతూ తమ ప్లాంట్‌ ద్వారా ఇకపై దేశం అమ్మోనియం దిగుమతుల స్థాయి నుంచి వివిధ దేశాల ఎగుమతి స్థాయికి చేరుకుంటుందని చెప్పారు. కాకినాడ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందన్నారు. గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా దేశంలో పెరిగిపోతున్న కర్బన్‌ ఉద్గారాలు తగ్గుతాయని వివరించారు. కాగా, సభలో వివిధ దేశాల నుంచి ఏఎం గ్రీన్‌ కంపెనీ అమ్మోనియం, హైడ్రోజన్‌ ఉత్పత్తికి సహకరిస్తున్న పలు కంపెనీలు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఏఎం గ్రీన్‌ కంపెనీ ప్రతినిధులతో కలిసి కాంక్రీట్‌ బటన్‌ నొక్కి ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 3డీ విధానంలో తయారు చేసిన ప్లాంట్‌ నమూనా పరిశీలించారు.

సాంకేతిక సమస్యతో నిలిచిన సీఎం హెలికాప్టర్‌

మధ్యాహ్నం 11.30 గంటలకు సభ ప్రారంభం కావలసి ఉండగా, సీఎం చంద్రబాబు అమరావతి నుంచి పయనమవ్వాల్సిన హెలికాప్టర్‌ అకస్మాత్తుగా సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. దీంతో కాకినాడ నుంచి వేరే హెలికాప్టర్‌ను అమరావతికి పంపించగా, దానిలో చంద్రబాబు ఆలస్యంగా కాకినాడకు చేరుకున్నారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాశ్‌, ఎంపీలు సానా సతీశ్‌, ఉదయ శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, కొండబాబు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, యనమల దివ్య, ఏఎం గ్రీన్‌ సంస్థ తరఫున పలువురు నిపుణులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 04:09 AM