Share News

రిజిస్ట్రేషన్లకు వీడియో కాల్‌ ధ్రువీకరణ

ABN , Publish Date - May 16 , 2026 | 04:39 AM

విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ర్టేషన్‌ వ్యవహారాలు సురక్షితంగా చేసుకోగలిగేందుకు వీలుగా ప్రభుత్వం వీడియో కాల్‌ కేవైసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

రిజిస్ట్రేషన్లకు వీడియో కాల్‌ ధ్రువీకరణ

  • న్నారైలకు సురక్షిత రిజిస్ట్రేషన్లే లక్ష్యం

  • జీవో జారీ చేసిన సీఎస్‌ సాయిప్రసాద్‌

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ర్టేషన్‌ వ్యవహారాలు సురక్షితంగా చేసుకోగలిగేందుకు వీలుగా ప్రభుత్వం వీడియో కాల్‌ కేవైసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు పంపిన పత్రాలను, అందులోని వివరాలను, ఇక్కడ వాటి ని అమలు చేసే వ్యక్తుల వివరాలను వీడియోకాల్‌ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే జిల్లా రిజిస్ర్టార్‌ స్టాంపింగ్‌ వేస్తారు. ఇప్పటివరకు ఇలాంటి ధ్రువీకరణ లేదు. విదేశాల్లో ఉండే వారు ఇచ్చిన పత్రాలపై మూడు నెలల్లోగా స్టాంపింగ్‌ చేసేవారు. కానీ, దీనివల్ల మోసాలు, ఫోర్జరీలు, నకిలీ రిజిస్ర్టేషన్లు జరుగుతుండడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వీడియోకాల్‌ ద్వారా ధ్రువీకరించుకోవడంతో పాటు, ఆ కాల్‌ను రికార్డ్‌ చేస్తారు. పాస్‌పోర్టు, సమర్పించిన గుర్తింపు రికార్డులతో ముఖాన్ని సరిపోల్చడం, జియో లొకేషన్‌ ట్యాగింగ్‌... వీటన్నింటినీ డిజిటల్‌ రూపంలో భద్రపరిచాకే పత్రాలపై స్టాంపింగ్‌ చేస్తారు. ఈ విధానంలో సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌ అభివృద్ధి, ప్రస్తుత కార్డు/ఐజీఆర్‌ఎస్‌ వ్యవస్థతో అనుసంధానం, వీడియో రికార్డులను సురక్షితంగా భద్రపర్చడం వంటి ఖర్చులు ఉంటాయి. ఇందుకోసం వీడియో కేవైసీ సేవలు ఉపయోగించుకునే దరఖాస్తుదారుల నుంచి రూ.1000 యూజర్‌ చార్జీ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - May 16 , 2026 | 04:40 AM