ప్రతి బుధవారం స్వచ్ఛపథం
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:31 AM
స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిరంతర పారిశుధ్య ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రారంభించిన పంచాయతీరాజ్‌శాఖ
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిరంతర పారిశుధ్య ఉద్యమంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛపథం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్‌శాఖ ప్రారంభించింది. పంచాయతీల్లో రోడ్ల పక్కన చెత్త కుప్పలను తొలగించడం, గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, స్థిరమైన ఘనవ్యర్థాల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ బుధవారం 13351 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రోడ్ల వెంబడి ఉన్న 17536 టన్నులు చెత్తను తొలగించి 13676 కి.మీలు మేర రోడ్లను శుభ్రపరిచారు. మొత్తం 45288 మంది కార్మికులు పాల్గొన్నారు. పీఆర్ వన్ యాప్ ద్వారా స్వచ్ఛపథం పురోగతిని సమీక్షిస్తున్నారు. జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, స్థానికసంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్ల ఎస్‌ఎస్ఆర్ రేట్ల ఖరారుకు కమిటీ
పీఎంఏవై అర్బన్ పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కింద ఏపీ టిడ్కో చేపట్టిన ఈడబ్ల్యూఎస్ గృహాల నిర్మాణాల్లో ధర సర్దుబాటు అమలుపై తలెత్తిన సందిగ్ధతలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. స్టాండర్డ్ డేటా అండ్ షెడ్యూల్ రేట్(ఎస్ఎస్ఆర్) ప్రకారం ధర సర్దుబాటు లెక్కింపులో ఉన్న సమస్యలు అధ్యయనంచేసి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలనే ఉద్దేశంతో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ఎండీ అభ్యర్థించిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీ టిడ్కో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ చైర్మన్‌గా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(ఆర్టీ)ను మెంబర్ కన్వీనర్‌గాను, ఏపీ హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్, ఏపీ సీఆర్‌డీఏ చీఫ్ ఇంజనీర్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ చీఫ్ ఇంజనీర్, ఆర్థికశాఖ ప్రతినిధి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.