రైతన్నా.. మీకోసం!
ABN , Publish Date - Jun 22 , 2026 | 06:27 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది.
నేటి నుంచే ప్రారంభం.. ఇంటింటికీ వ్యవసాయ శాఖ అధికారులు
ఎల్‌నినో, యాప్‌లో ఎరువులు, పంటల వైవిధ్యంపై అవగాహన
అమరావతి, జూన్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమం సోమవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఆరు రోజులపాటు వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎల్‌నినో ప్రభావం, నివారణ చర్యలు, ఏపీఎయిమ్స్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎరువుల పంపిణీ, పంట ల వైవిధ్యీకరణపై ఈ నెల 22 నుంచి 27వరకు రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వ్యవసాయ, అనుబంధ శాఖ ల ఉద్యోగులు రైతుల ఇళ్లకు వెళ్లి, ఈ అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి రైతు సేవా కేంద్రాల వ్యవసాయ, ఉద్యాన సహాయకులు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ప్రతి మూడు ఇళ్లను ఒక క్లస్టర్‌గా విభజిస్తారు. ప్రతి టీమ్ రోజుకు 30క్లస్టర్లు తిరిగి, రైతులకు అవగాహన కల్పిస్తుందని డైరెక్టర్ తెలిపారు. అభ్యుదయ రైతులు, పీఏసీఎస్, సాగునీటి సంఘాలు, మార్కెట్ యార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వం కోరింది. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గుదల వల్ల పంటలకు నీటి ఎద్దడికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం, చిరు ధాన్యాల పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తారు. ఏపీఎయిమ్స్ యాప్‌లో ఎరువుల కొనుగోలు విధానంతో పాటు యాప్ డౌన్‌లోడ్, శాస్త్రీయ సిఫారసుల మేరకు ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 666 మండలాల్లోని 8,451 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 46.85 లక్షల మంది రైతు కుటుంబాలను ఉద్యోగులు కలిసి, ప్రధాన అంశాలపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించింది.