Share News

నేడే ‘నేతన్న సేవలో..’

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:33 AM

చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీలకు అతీతంగా అమలు చేస్తున్న ఈ కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి..

నేడే ‘నేతన్న సేవలో..’

  • చేనేత కార్మికుల ఖాతాల్లో రూ.25 వేలు

  • చీరాలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం

  • రాష్ట్రంలోని 71,536 కుటుంబాలకు 179 కోట్లు

అమరావతి, బాపట్ల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఎన్నికల హామీలకు అతీతంగా అమలు చేస్తున్న ఈ కొత్త పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తోంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న సీఎం చంద్రబాబు చీరాలలో ప్రారంభించబోతున్న ఈ పథకానికి ‘నేతన్న సేవలో..’ అని పేరు పెట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన చేనేత జౌళి శాఖ 71,536మంది (కుటుంబానికి ఒకరు) చేనేత కార్మికుల్ని ఈ పథకానికి ఎంపిక చేసింది. శుక్రవారం వేటపాలెం మండలం కొత్తపేటలో పథకాన్ని ప్రారంభించి అర్హుల బ్యాంకు ఖాతాలో రూ.25వేల చొప్పున సీఎం జమ చేయనున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఇది అదనం అని చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో అర్హులైన చేనేత కార్మికుల్లో యాభై ఏళ్లు దాటిన 85వేల మంది నేతన్నలకు నెలకు రూ.4వేల చొప్పున పింఛను ఇస్తున్న కూటమి ప్రభుత్వం.. 62,541మంది చేనేతలకు నెలకు 200యూనిట్లతోపాటు 10,032మంది పవర్‌ లూమ్‌ కార్మికులకు 500యూనిట్లు ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేస్తోంది. మరోవైపు 109చేనేత సహకార సంఘాలకు రూ.79కోట్లతో క్యాష్‌ క్రెడిట్‌, హ్యాండ్లూమ్‌ పార్కులు, చేనేత మ్యూజియం, టెక్స్‌టైల్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ వంటి కార్యక్రమాలతో చేనేత రంగానికి ప్రభుత్వం ఊతమిస్తోంది. మంగళగిరిలో హ్యాండ్లూమ్‌ పార్కు, శాఖమూరులో చేనేత-హస్తకళల మ్యూజియం ఏర్పాటు చేస్తోంది.


పర్యటన సాగేదిలా..: ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10:30కు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 10:50కి చీరాల కొత్తపేటలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11:05కు ప్రజావేదికకు చేరుకుని, 12:35 వరకు సమావేశంలో పాల్గొంటారు. 1:20కి జాండ్రపేటలో లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మఽధ్యాహ్నం 2:15కి కార్యకర్తల సమావేశంలో పాల్గొని, 4:25కి తిరిగి ప్రయాణమవుతారు. సీఎం సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఎస్‌.సవిత పరిశీలించారు.

Updated Date - Aug 07 , 2026 | 04:34 AM