Share News

ల్యాండ్‌ లిటిగేషన్‌ ఫ్రీగా ఆంధ్ర

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:15 AM

‘భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. ప్రక్షాళన-విముక్తి-భద్రత ప్రధాన అంశాలుగా, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది..

ల్యాండ్‌ లిటిగేషన్‌ ఫ్రీగా ఆంధ్ర

  • భూ మోసాలకు శాశ్వత పరిష్కారం.. నవంబరు నుంచి ట్యాంపర్‌ ప్రూఫ్‌ వ్యవస్థ

  • ‘మీ భూమి-బ్లాక్‌ చెయిన్‌’ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): ‘భూ రికార్డులు సరిగా లేకపోవడం వల్ల విలువైన భూముల విషయంలో మోసాలు జరుగుతున్నాయి. ప్రక్షాళన-విముక్తి-భద్రత ప్రధాన అంశాలుగా, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం సచివాలయం నుంచి ‘మీ భూమి- బ్లాక్‌ చెయిన్‌’ ప్రాజెక్టును వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ‘తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ల్యాండ్‌ లిటిగేషన్లు తక్కువే. కానీ గత ప్రభుత్వ విధానం వల్ల ఏపీలోనూ భూ తగాదాలు, వివాదాలు పెరిగాయి. 22ఏ పేరుతో కక్షసాధింపులకు పాల్పడ్డారు. ప్రక్షాళన, విముక్తి, భద్రత వంటి అంశాలపై దృష్టిసారించి భూ సమస్యలను పరిష్కరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేపడుతున్నాం. రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు రాజముద్ర వేసి ఇస్తున్నాం. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుంటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములకు విముక్తి కల్పించాం. భూ రికార్డులకు ట్యాంపర్‌ ప్రూఫ్‌ వ్యవస్థను తెస్తున్నాం. పటిష్ఠమైన భద్రత కల్పిస్తున్నాం. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా రెవెన్యూ సర్వే, రిజిస్ట్రేషన్‌ విభాగాలు ఒకేవేదిక మీదకు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు. రెండు నెలల పాటు ఈ ఫైలెట్‌ ప్రాజెక్టు అమలును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. ఈ వ్యవస్థ అమల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని నమోదు చేసుకోవడానికి ఫిర్యాదుల సెల్‌ పెట్టాలి. ఇప్పటి నుంచి సర్వే పూర్తి అయిన గ్రామాలు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ వ్యవస్థలోకి వెళ్తాయి. నవంబరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. భూ సమస్యలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేలా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ల్యాండ్‌ లిటిగేషన్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేలా కృషి చేసున్నాం’ అని తెలిపారు. ఈ ప్రాజెక్టులోని ప్రత్యేకతలను సీఎస్‌ సాయిప్రసాద్‌, రెవెన్యూ అధికారులు వివరించారు. ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 05:16 AM