స్థానిక ఆస్పత్రుల్లోనే సదరం స్లాట్స్
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:08 AM
దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతులు) వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని..
8 నుంచి బుకింగ్: మంత్రి సత్యకుమార్
అమరావతి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల (విభిన్న ప్రతిభావంతులు) వైకల్య అంచనా, ధ్రువీకరణ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులు వ్యయప్రయాసలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా సదరం స్లాట్ బుకింగ్‌ను మరింత సరళతరం చేస్తున్నామని చెప్పారు. సదరం స్లాట్ బుకింగ్‌లను జోనల్ స్థాయిలో స్థానిక ఆస్పత్రుల్లో చేసుకోవడానికి వీలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు చివరి వరకూ స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీనివల్ల వైద్యులు, అధికారులపై పని ఒత్తిడి తగ్గుతుందని, దివ్యాంగులకు ప్రయాణపరంగా వెసులుబాటు, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెప్పారు. ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయన్నారు. సొంత జిల్లాలో స్లాట్‌లు అందుబాటులో లేకపోవడంతో పలువురు దూర ప్రాంతాల్లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటున్నారు. దీని ఫలితంగా సదరం ఐడీలను బదిలీ చేయాలంటూ పదేపదే విజ్ఞప్తులు, పాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి అన్నారు. జోనల్ విధానంతో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరోవైపు స్లాట్ బుకింగ్ సేవలు పూర్తిగా ఉచితమని, మధ్యవర్తులు లేదా దళారులకు డబ్బు చెల్లించవద్దని మంత్రి స్పష్టం చేశారు.