నేటి నుంచి విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:04 AM
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం వెల్లడించారు.
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం వెల్లడించారు. బుధవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యశాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తిస్తే.. దాదాపు 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. దీనికి సుమారు రూ.7కోట్ల వరకూ వ్యయం అవుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులందరికీ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 95 వేల కళ్లద్దాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించిందని, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని 2.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. దృష్టి లోపం కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకుండా చూడడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. కంటి పరీక్షలు ప్రతి విద్యార్థికీ జరిగేలా కలెక్టర్లు, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.