Share News

జిల్లాకో నైపుణ్య ప్రణాళిక

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:00 AM

ప్రతి జిల్లాకూ ఒక ప్రత్యేకమైన నైపుణ్య ప్రణాళిక రూపొందించే ప్రక్రియను నైపుణ్యాభివృద్ధిశాఖ ప్రారంభించింది. దీనిపై అన్ని జిల్లాల ప్రణాళికలతో గురువారం....

జిల్లాకో నైపుణ్య ప్రణాళిక

  • పరిశ్రమలకు అనుగుణంగా ఉండాలి

  • ప్రతి టెన్త్‌ విద్యార్థినీ ట్రాక్‌ చేస్తున్నాం

  • ఉద్యోగావకాశాలకు తగ్గట్లు శిక్షణ

  • నైపుణ్య నివేదికలపై రాష్ట్రస్థాయి సదస్సు

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ప్రతి జిల్లాకూ ఒక ప్రత్యేకమైన నైపుణ్య ప్రణాళిక రూపొందించే ప్రక్రియను నైపుణ్యాభివృద్ధిశాఖ ప్రారంభించింది. దీనిపై అన్ని జిల్లాల ప్రణాళికలతో గురువారం విజయవాడలో నైపుణ్యాభివృద్ధి శాఖ సదస్సు నిర్వహించింది. సదస్సులో విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల కార్యదర్శి కోన శశిధర్‌ మాట్లాడుతూ... ‘జిల్లాల్లో కొత్తగా రాబోయే పరిశ్రమలకు అనుగుణంగా భవిష్యత్తు నైపుణ్య ప్రణాళికలు ఉండాలి. ఆయా రంగాలవారీగా కొత్తగా వచ్చే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు ఇవ్వాలి. ఈ శిక్షణ వల్ల ప్రజల ఆదాయం పెరగాలి. ఉద్యోగాల కల్పనలో వాస్తవిక అంశాలనే నివేదికల్లో పెట్టాలి. ప్రభుత్వం ఇటీవల చేసుకున్న ఎంవోయూల వల్ల వచ్చే పరిశ్రమలతో వచ్చే ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రజలకే వచ్చేలా వారికి నైపుణ్యం కల్పించాలి. ఇక్కడ సరైన నైపుణ్యం ఉన్నవారు అందుబాటులో లేకపోతే ఇతర రాష్ర్టాలవారు వస్తారు. ముందుగానే నైపుణ్య శిక్షణ ఇస్తే ఇక్కడి వారికే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. పదో తరగతి పూర్తయిన ప్రతి విద్యార్థీ ఏం చేస్తున్నాడనేది ట్రాక్‌ చేస్తున్నాం. అయితే ఉన్నత విద్యకు వెళ్లాలి, లేనిపక్షంలో నైపుణ్య శిక్షణ తీసుకోవాలి’ అన్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖ కమిషనర్‌ జి.గణే్‌షకుమార్‌, సీడాప్‌ సీఈవో నారాయణస్వామి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నప్పుడు 30శాతం వినతులు వారి పిల్లలకు ఉద్యోగాలు కావాలనే వస్తున్నాయని సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ఏపీ(సీడాప్‌) చైర్మన్‌ గుణపాటి దీపక్‌రెడ్డి అన్నారు. మరోవైపు తమకు అవసరమైన నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం లేదని పరిశ్రమల యాజమాన్యాలు అంటున్నాయని చెప్పారు. ఐదేళ్లలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్‌ బూరుగుపల్లి శేషారావు అన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 05:00 AM