Share News

యాప్‌లో ఎరువుల విక్రయాలు

ABN , Publish Date - Jun 07 , 2026 | 05:18 AM

యూరియా, డీఏపీ పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విధానంలో చర్యలకు సిద్ధమైంది. ఎరువుల విక్రయం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌..

యాప్‌లో ఎరువుల విక్రయాలు

  • రేపటి నుంచే అమల్లోకి..

  • కృష్ణా, కాకినాడ మినహా రాష్ట్రమంతా

  • ‘ఏపీఎయిమ్స్‌’ యాప్‌ ద్వారా పంపిణీ

  • ఇష్టమైన డీలర్‌ నుంచి తీసుకునే వీలు

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): యూరియా, డీఏపీ పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ విధానంలో చర్యలకు సిద్ధమైంది. ఎరువుల విక్రయం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ (ఏపీఎయిమ్స్‌ 2.0) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ మినహా మిగతా 26 జిల్లాల్లో సోమవారం నుంచి ‘ఏపీఎయిమ్స్‌’ ద్వారా రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్‌కు పైలట్‌గా ఎంపికైనందున కృష్ణా, కాకినాడ జిల్లాలను మాత్రం మినహాయించినట్లు వివరించారు. యాప్‌ ఆధారిత ఎరువుల విక్రయంపై వ్యవసాయ అధికారులకు శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మార్గదర్శకాలు జారీ చేశారు. పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు. వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను దారి మళ్లించడాన్ని కట్టడి చేసేందుకు యాప్‌ విధానాన్ని తెచ్చామని చెప్పారు. వాస్తవ సాగుదారులకు యూరియా, డీఏపీ వంటి ఎరువులు అవసరం మేరకు లభ్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని విక్రయ కేంద్రాల నుంచి ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్‌లో ఉందన్నారు. వాస్తవ సాగుదారులకు యాప్‌ గురించి అవగాహన కల్పించాలని, అలాగే అనర్హులకు లభ్యత ఉండదన్న సంకేతం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎరువులపై కేంద్రం సబ్సిడీ భారీగా భరిస్తున్న నేపథ్యంలో అవి పక్కదారి పట్టకుండా నిఘా విభాగాలు నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బంది, అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరం మేరకే ఎరువులు వాడాలని, ముఖ్యంగా యూరియా, డీఏపీ విక్రయం, వాడకంలో అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.


బుక్‌ చేసుకునే విధానమిదీ...

రైతు సేవా కేంద్రంలోని అగ్రి కల్చర్‌ అసిస్టెంట్‌, సహకార సంఘాలు (పీఏసీఎస్‌), ఎరువుల విక్రయ లైసెన్స్‌ పొందిన అధీకృత రిటైల్‌ డీలర్ల వద్ద యాప్‌ డౌన్‌లోడ్‌ అయి ఉంటుంది. రైతులు ఆధార్‌ నంబర్‌ చెబితే బుక్‌ చేసి..టోకెన్‌ జారీచేస్తారు. వారి మొబైల్‌ నంబరుకు సంక్షిప్త సమాచారం కూడా వస్తుంది. దానిని చూపించి.. రైతులు తమకు ఇష్టమైన విక్రయ కేంద్రాల (రిటైలర్ల) నుంచి ఎరువులు తీసుకునే అవకాశం ఉంటుంది. యాప్‌లో బుక్‌ చేసుకుంటే ఎమ్మార్పీ ధరలకే రైతులు ఎరువులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి రైతుకు ఒక్కో సీజన్‌లో గరిష్ఠంగా 50 బస్తాల ఎరువులు అందేలా యాప్‌కు రూపకల్పన జరిగింది. అయితే ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా ఏ రైతు ఎంత విస్తీర్ణంలో పంట వేశారో, ఏ రకం, ఎంత ఎరువు తీసుకున్నారనే డేటా రైతుసేవా కేంద్రాల ద్వారా వ్యవసాయశాఖకు అందుతుంది. దాన్ని బట్టి పంటకు ఎరువుల అవసరం, రైతుల కొనుగోలు, వాస్తవ వినియోగం ఎంత అనేది తెలుస్తుంది. తద్వారా ఎరువులు ఎక్కడి నుంచి ఎవరి ద్వారా ఎంత పక్కదారి పడుతుందో కూడా తెలిసిపోయే వీలు ఉంటుంది. ఇందుకోసం రిటైల్‌ వ్యాపారులను రైతు సేవా కేంద్రాలకు వ్యవసాయశాఖ మ్యాపింగ్‌ చేసింది.

Updated Date - Jun 07 , 2026 | 05:19 AM